RK Roja: ఆయన ఆశయం కోసం పోరాడే పులి: మంత్రి రోజా
Minister RK Roja Speech In YSRCP Plenary| అమ్మను మించిన దైవం లేదు. జగన్‌ను మించిన ధైర్యం లేదు అని మంత్రి రోజా అన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన రోజా తనదైన స్టైల్లో పంచ్ డైలాగులు పేల్చారు. ప్లీనరీ వేదికగా సీఎం జగన్ ఒక పులి అని
దిశ, ఏపీ బ్యూరో : Minister RK Roja Speech In YSRCP Plenary| అమ్మను మించిన దైవం లేదు. జగన్‌ను మించిన ధైర్యం లేదు అని మంత్రి రోజా అన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన రోజా తనదైన స్టైల్లో పంచ్ డైలాగులు పేల్చారు. ప్లీనరీ వేదికగా సీఎం జగన్ ఒక పులి అని, కాన్ఫిడెన్స్‌కు కటౌట్ లాంటి వాడంటూ తెగ ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణ రాజకీయ పార్టీ కాదని దేశాన్ని గజగజ వణికించిన సోనియాగాంధీని గడగడలాడించిన పార్టీ అని స్పష్టం చేశారు. అంతేకాకుండా వెన్నుపోటు దారుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి రోజా అన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి ఓ విజేతగా మనందరి ముందు జగన్ నిలబడ్డ మెునగాడు సీఎం వైఎస్ జగన్ అని రోజా కొనియాడారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. ఎన్నో సవాళ్లను అధిగమించి నేడు దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీని నిలబెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని రోజా స్పష్టం చేశారు.
కాన్ఫిడెన్స్‌కు కటౌట్ వేస్తే జగన్‌లా ఉంటుంది..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సీఎం వైఎస్ జగన్ ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం అని మంత్రి రోజా అన్నారు. కాన్ఫిడెన్స్‌కు కటౌట్ వేస్తే జగన్‌లా ఉంటుందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. కమిట్ మెంట్‌కు కలర్స్ వేస్తే సీఎం జగన్‌లానే ఉంటుంది అంటూ ఓ రేంజ్‌లో పొగిడేశారు. అక్కడితో ఆగిపోలేదు ఈ కటౌట్ చూస్తే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయి.. ఈ కంటెట్ చూస్తే ప్రత్యర్థులకు ప్యాంట్లు తడిచిపోతాయంటూ రోజా తనదైన స్టైల్‌లో పంచ్‌ల వర్షం కురిపించారు. 'ఆకలితో వేటాడే పులిని చూసి ఉంటారు.. ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు.. ఆధిపత్యం కోసం వేటాడేపులిని చూసుంటారు.. కానీ ఆశయం కోసం వేటాడే పులే ఈ పులివెందుల బిడ్డ జగన్' అంటూ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలకు సభ అంతా విజిల్స్ మోత మోగించింది. జై జగన్ అంటూ వైసీపీ శ్రేణులు నినదించారు.
జగనన్నను మించిన ధైర్యం లేదు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో విజయ దుందుభి మోగించిందని అది ఒక చరిత్ర అని మంత్రి రోజా అన్నారు. అంతేకాదు పాలనలో సైతం అనేక రికార్డులను సృష్టించిందని సీఎం వైఎస్ జగన్ పాలనలో అనేక విప్లవం తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన 12ఏళ్లలో 9ఏళ్లు పోరాటం చేయడంలో రికార్డు సృష్టించినట్లు రోజా తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి మరో రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ఇన్ని రికార్డులకు ఒక కారణం లీడర్ అయితే.. మరో కారణం క్యాడర్ అంటూ మంత్రి రోజా పంచ్‌లు వేశారు. అధికారంలోకి రాకముందు జగన్‌కు బంగారు రాఖీ కట్టి సీఎం కావాలని కోరుకుంటే.. అనుకున్న విధంగానే ఆయన ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో మహిళలకు బంగారు భవిష్యత్తు ఇస్తున్నారని కొనియాడారు. అంతేకాదు సీఎం జగన్ ముద్దుల కుమార్తె హర్షారెడ్డి మాస్టర్స్ డిగ్రీ పొందడంపై రోజా ప్లీనరీ వేదికగా అభినందలు తెలిపారు రోజా. తన బిడ్డలు ఎంత గొప్పగా చదువుకొని గౌరవం పొందాలని ప్రతీ తండ్రీ కోరుకుంటారని.. అలాగే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ కూడా అదేస్థాయికి వెళ్లాలని సీఎం జగన్ కోరుకుంటున్నారని అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచేందుకు అనేక చట్టాలను సీఎం జగన్ తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో ముల్లు గుచ్చుకున్నా.. ఒంట్లో కత్తిదిగినా బెదరకుండా ముందుకెళ్లిన నాయకుడు వైఎస్ జగన్ అని మంత్రి రోజా అన్నారు. చివరగా అమ్మను మించిన దైవం లేదు.. కానీ అన్నను మించిన ధైర్యం లేదంటూ మంత్రి రోజా తన పొగడ్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. మొత్తానికి మంత్రి రోజా ప్రసంగం ఆద్యంతం అందర్నీ ఉత్సాహభరితులను చేసింది. రోజా పేల్చే ప్రతీ పంచ్ డైలాగ్ ప్రతీ ఒక్కరిని తాకింది. దీంతో రోజా ప్రసంగం జరుగుతున్నంత సేపు సభ అంతా సందడిగా మారిపోయింది. ఓ రేంజ్‌లో విజిల్స్, చప్పట్ల మోత మోగించారు వైసీపీ శ్రేణులు, అభిమానులు. అంతేకాదు రోజా ప్రసంగానికి అటు సీఎం వైఎస్ జగన్ దగ్గర నుంచి ప్రతి నాయకుడు సైతం ఎంతో ఆసక్తిగా ఆలకించడం విశేషం.