పోలీసులపై రెచ్చిపోయిన మంత్రి పేర్ని నాని (వీడియో)

Update: 2022-03-04 12:29 GMT

దిశ, ఏపీ బ్యూరో : పోలీసు అధికారులపై రాష్ట్రమంత్రి పేర్ని నాని రెచ్చిపోయారు. తమాషాలు చేస్తున్నారా అంటూ వార్నింగ్ ఇచ్చారు. నా కారునే తియ్యమంటారా? నాకంటే తక్కువ డిజిగ్నేషన్లు ఉన్న వారి కార్లను ఉంచి నా కార్లను తియ్యమంటారా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఈ షాకింగ్ ఘటన పోలవరం ప్రాజెక్టు వద్ద చోటు చేసుకుంది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌‌తో కలిసి సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు కేంద్రమంత్రి, సీఎం పర్యటన అసలే ఏజెన్సీ ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు బీజేపీ కార్యకర్తలు ఇటు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు.

అయితే ఈ పర్యటనకు పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి హోదాలో పేర్ని నాని కూడా వెళ్లారు. మంత్రి కారు పార్కింగ్ విషయంలో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రూట్‌కు మంత్రి కారు అడ్డుగా ఉందని.. దాన్ని పక్కకు తీయాలని ప్రోటోకాల్ సిబ్బంది కోరారు. దీంతో ప్రోటోకాల్ సిబ్బందిపై కన్నెర్రజేశారు. నోటికి పని చెప్పారు. 'ఈ కార్లన్నీ ఎవరివి.. తమాషాలు చేస్తున్నారా.. కారు తీయమన్నది ఎవరు.. ఎస్పీ, డీఐజీ కార్లు ఇక్కడెందుకు ఉంటాయి అంటూ మండిపడ్డారు. తనకంటే వాళ్లు ఎన్ని డిసిగ్నేషన్లు తక్కువ.. మర్యాదగా ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న పోలీసు అధికారులు మంత్రి పేర్ని నాని వద్దకు చేరుకుని సర్ధిచెప్పడంతో ఆయన శాంతించారు.

మంత్రి సీదిరి అప్పలరాజు అంతే

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవలే విశాఖలోని శారదాపీఠం సందర్శనకు వెళ్లారు. అయితే మంత్రి సీదిరి అప్పలరాజు తన అనుచరులతో కలిసి ముఖ్యమంత్రివెంట శారదాపీఠంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మంత్రికి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన పోలీసులు అనుచరులకు మాత్రం ఇవ్వలేదు. ఈ విషయంలో మంత్రి సీదిరి అప్పలరాజుకు చిర్రెత్తుకొచ్చింది. పోలీసు అధికారిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇష్టం వచ్చిన రీతిలో నోటికొచ్చినన్ని తిట్లు తిట్టేశారు. ఈ విషయంపై ఏకంగా పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే కోవలో మంత్రి పేర్ని నాని కూడా చేరారు.

Tags:    

Similar News