ఆమె జీవితం మహిళా లోకానికి, ఉద్యమాలకు ఆదర్శం : మంత్రి ఎర్రబెల్లి
దిశ ప్రతినిధి, వరంగల్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోనున్న మాకినేని బసవ పున్నయ్య భవన్‌లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట
దిశ ప్రతినిధి, వరంగల్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోనున్న మాకినేని బసవ పున్నయ్య భవన్‌లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం దేహంపై ఆదివారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి తన సంతాపాన్ని తెలిపారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఆమెకు పీడిత ప్రజల పక్షపాతిగా వర్ణించారు. నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన మహిళా యోధురాలు మల్ల స్వరాజ్యం అని పేర్కొన్నారు. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషిచేసిన మల్లు స్వరాజ్యం జీవన గమనం, గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తీరని లోటు అని అన్నారు. తూటా లా పేలే తన మాట ను పాటగా మార్చి అనేక మంది ప్రజలను, ప్రత్యేకించి మహిళలను ఆమె చైతన్య పరిచారు అన్నారు. ప్రత్యేకించి పాలకుర్తిలో చాకలి ఐలమ్మ, దేవులపల్లి వెంకటేశ్వరావు, తన సోదరుడు భీం రెడ్డి నరసింహ రెడ్డి వంటి ఉద్ధండులతో కలిసి పని చేశారన్నారు. ఆమె నడయాడిన నేల పాలకుర్తి ప్రాంతం ఇప్పటికీ చైతన్యం గల ప్రాంతంమని అన్నారు. మల్ల స్వరాజ్యం పాలకుర్తి ప్రాంతానికి విడదీయరాని అనుబంధం ఉందని మంత్రి తెలిపారు. ఆమె జీవితం మహిళా లోకానికి, ఉద్యమాలకు ఆదర్శం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆమె స్ఫూర్తిదాయకం అని మంత్రి అభిప్రాయపడ్డారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య తదితరులు ఉన్నారు.