సులభంగా ఫైనాన్స్ అందించేందుకు ఎంజీ మోటార్ 'ఎంజీ ఈపే' ప్లాట్‌ఫామ్!
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తన వాహనాల..telugu latest news
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తన వాహనాల కొనుగోలులో వినియోగదారులకు సౌకర్యవంతమైన ఫైనాన్స్ అందించేందుకు వన్-స్టాప్ డిజిటల్ కార్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్‌ను గురువారం ప్రారంభించింది. 'ఎంజీ ఈపే' పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ ప్రముఖ బ్యాంకుల నుంచి ఇబ్బందుల్లేని, సులభతర, తక్షణ ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తూ, తక్కువ సమయంలో ఆన్‌లైన్ ఆటో ఫైనాన్స్ సేవలను అందిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది.
ఈ తక్షణ ఫైనాన్స్ సేవలందించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్, యాక్సిస్ బ్యాంకులతో ఎంజీ మోటార్ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎంజీ ఈపే ప్లాట్‌ఫామ్ లాంచింగ్ సందర్భంగా మాట్లాడిన ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా.. ఎంజీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నుంచి ఇప్పటివరకు లక్ష కంటే ఎక్కువ మంది వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాం. ప్రస్తుతం ఈ సేవలను మరింత ముందుకు తీసుకెళ్తూ వాహనాల కొనుగోలులో కస్టమర్లు మరింత సులభంగా ఫైనాన్స్ పొందేందుకు 'ఎంజీ ఈపే' ఎంతో ఉపయోగపడుతుందని ' చెప్పారు. త్వరలో ఈ సేవలను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.