జుకర్‌బర్గ్ కొత్త అంగడి.. డిజిటల్ అవతార్స్ కోసం 'బట్టల షాప్'
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మనం మెటా యుగంలో ఉన్నాం. మెటావర్స్ నిజమైన ప్రపంచం కాకపోయినా మనం జీవిస్తున్న యూనివర్స్‌కు అనుబంధంగా వర్చువల్ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వంటి సాంకేతికతతో కూడిన ఆర్టిఫిషియల్ వరల్డ్..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మనం మెటా యుగంలో ఉన్నాం. మెటావర్స్ నిజమైన ప్రపంచం కాకపోయినా మనం జీవిస్తున్న యూనివర్స్‌కు అనుబంధంగా వర్చువల్ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వంటి సాంకేతికతతో కూడిన ఆర్టిఫిషియల్ వరల్డ్. అంటే వాస్తవ ప్రపంచంలో ఉన్న మనలాంటి అవతారమే కృత్రిమ ప్రపంచంలో విహరిస్తుందన్న మాట. అయితే ఈ మెటా యూనివర్స్‌లోని డిజిటల్ అవతార్‌ల కోసం 'మెటా అవతార్స్ స్టోర్' పేరుతో డిజైనర్ క్లాతింగ్ స్టోర్ ప్రారంభించినట్లు మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్యాషన్ పార్టనర్‌షిప్స్ 'ఎవా చెన్'తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆయన ఈ ప్రకటన చేశాడు.
మెటావర్స్‌లోని అవతార్ అనేది యూజర్స్ ప్రతిబింబం కాగా వర్చువల్ ప్రపంచంలో అదే మన గుర్తింపు. ప్రతీ అవతార్‌కు కదిలే అవయవాలు సహా వ్యక్తీకరణ సామర్థ్యం గల ముఖం తదితర మానవరూప లక్షణాలు ఉంటాయన్నది తెలిసిన విషయమే. అయితే వాస్తవ ప్రపంచం మాదిరిగానే, అవతార్ కోసం బట్టలు కూడా కొనుగోలు చేయొచ్చన్నది మాత్రం చాలామందికి తెలియదు. కాగా ఈ డిజిటల్ దుస్తులను మార్కెట్‌లో కొనుగోలు చేయొచ్చు లేదా విక్రయించవచ్చు. ఈ మేరకు మెటా యాజమాన్యం 'మెటా అవతార్స్ స్టోర్' ప్రారంభించింది.
'Balenciaga, Prada, Thom Browne' వంటి బ్రాండెడ్ డిజిటల్ క్లాత్స్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరిన్ని బ్రాండ్స్ యాడ్ కానున్నాయని జుకర్‌బర్గ్ పేర్కొన్నాడు. యూఎస్, కెనడా, థాయిలాండ్, మెక్సికోలో వచ్చే వారం మెటా అవతార్స్ స్టోర్ ప్రారంభం కానుందని టెక్ క్రంచ్ నివేదిక తెలపగా.. దుస్తుల ధరలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే డిజిటల్ అవతార్స్ కోసం ఉచిత దుస్తులు కూడా అందుబాటులోనే ఉంటాయని తెలుస్తోంది.
'ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లో మా అవతార్స్ స్టోర్ ప్రారంభిస్తున్నాం. మీరు మీ అవతార్‌ను రెడీ చేసేందుకు డిజిటల్ దుస్తులు కొనుగోలు చేయొచ్చు. మెటావర్స్‌లో మిమ్మల్ని మీరు వ్యక్తీకరించడానికి డిజిటల్ వస్తువులు ఒక ముఖ్యమైన మార్గం. మరిన్ని బ్రాండ్స్‌ను జోడించి త్వరలో VR(వర్చువల్ రియాలిటీ)కి కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను' అని జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ తన పోస్ట్‌లో ప్రస్తావించాడు.