కారును హెలికాప్టర్‌గా మార్చేసిన మెకానిక్.. పెళ్లిళ్లకు రెంట్ సర్వీస్

Update: 2022-02-15 07:49 GMT

దిశ, ఫీచర్స్ : భారతీయ పెళ్లి వేడుకల్లో కనిపించే హంగు, ఆర్భాటాల గురించి తెలియంది కాదు. తమ వివాహాన్ని చిరస్మరణీయంగా మలచుకునేందుకు భిన్నంగా ఆలోచిస్తున్న వధూవరులు.. రథాలు, గుర్రాలు లేదా లగ్జరీ వెహికల్స్‌లో వివాహ వేదికకు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకొందరు హెలికాప్టర్‌‌లో వచ్చేందుకు కూడా వెనకాడటం లేదు. అయితే హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. ఆ ఖర్చును భరించడం అందరికీ సాధ్యపడదు. అటువంటి వారి కోసం ఆలోచించిన బీహార్‌ మెకానిక్ కమ్ ఆర్టిస్ట్.. టాటా నానో కారును హెలికాప్టర్‌గా మార్చేసి మ్యారేజ్ సర్వీస్‌లకు అద్దెకు ఇస్తున్నాడు.

బీహార్, బగాహకు చెందిన గుడ్డు శర్మ అనే వ్యక్తి రూ.2 లక్షలు వెచ్చించి నానో కారును హెలికాప్టర్‌ మోడల్‌లో మార్చేశాడు. వాహనాన్ని పూర్తిగా ఈ స్టైల్‌లో సిద్ధం చేసేందుకు అతడు సెన్సార్లను ఉపయోగించినట్లు సమాచారం. శర్మ కొత్త ఆవిష్కరణ స్థానికులను విపరీతంగా ఆకట్టుకోగా.. ఇప్పటికే 19 మంది న్యూ కపుల్స్ తమ వెడ్డింగ్ కోసం ఈ వెహికల్‌ను బుక్ చేసుకున్నారు. ఇక ఈ హెలికాప్టర్‌ సర్వీస్‌ కోసం శర్మ రూ.15,000కు అద్దె వసూలు చేస్తున్నాడు.




 


ఇలా నానో కారును హెలికాప్టర్ మోడల్‌లో తీర్చిదిద్దిన శర్మ మాట్లాడుతూ.. 'డిజిటల్ యుగంలో ఈ ఆవిష్కరణ భారతదేశ స్వావలంబనకు సజీవ ఉదాహరణ. దీని తయారీకి ఒకటిన్నర లక్షల రూపాయలు ఖర్చయింది. ఇలాంటి హైటెక్ లుక్ తీసుకొచ్చేందుకు వెచ్చించిన డబ్బుతో మొత్తం రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువే ఖర్చు చేశా' అని చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..