రిజర్వ్ ఫారెస్ట్ లో కార్చిచ్చు.. 8-10 చదరపు కిలోమీటర్ల మేర వ్యాప్తి
జైపూర్: రాజస్థాన్ సరిస్కా టైగర్ రిజర్వ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి..telugu latest news
జైపూర్: రాజస్థాన్ సరిస్కా టైగర్ రిజర్వ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆదివారం చిన్నగా మొదలైన మంటలు దావానలంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. సుమారు 8-10 చదరపు కిలోమీటర్ల మేర అంటే 1800 ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో అక్బర్‌పూర్ రేంజ్‌లో మంటలు వ్యాపించాయని ఫీల్డ్ డైరక్టర్ రూప్ నారయణ్ మీనా తెలిపారు. ఆదివారం గుర్తించిన మంటలను తర్వాతి రోజు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదని చెప్పారు. బలమైన గాలుల ధాటికి మంటలు కొండ ప్రాంతాన్ని చేరినట్లు వెల్లడించారు. వెంటనే విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారమిచ్చినట్లు తెలిపారు.
ఇక మంటలు తీవ్రం కావడంతో అదుపులోకి తీసుకువచ్చేందుకు ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. వీటి ద్వారా నీళ్లను చల్లుతూ మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టారు. పాక్షికంగా కొండ ప్రాంతంలో మంటలు తగ్గాయని తెలిపారు. అయితే హెలికాప్టర్లు మంటలను ఆర్పివేసే చర్యలను కొనసాగిస్తాయని ప్రకటనలో చెప్పారు. అటవీ సిబ్బంది సహా దాదాపు 200 మంది మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభావిత అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కాగా, అగ్ని కీలల ధాటికి 9 పులులతో పాటు కూనలు ప్రభావితం కావచ్చని అంచనా వేస్తున్నారు. సరిస్కా రిజర్వ్‌లో మొత్తం 27 పులులు ఉన్నట్లు తెలిపారు.