ఒకచేత గన్ను, మరోచేత పెన్ను పట్టిన ధీరుడు KG సత్యమూర్తి ప్రస్థానమిదే!
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలంలో కొండపల్లి సీతారామయ్యతో కలసి "పీపుల్స్ వార్” పార్టీని స్థాపించాడు కే.జీ.సత్యమూర్తి. ఆయన అజ్ఞాతవాసం చేస్తూ శివసాగర్‌గా, విప్లవ కవితోద్యమానికి సారథ్యం వహించాడు.
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలంలో కొండపల్లి సీతారామయ్యతో కలసి "పీపుల్స్ వార్" పార్టీని స్థాపించాడు కే.జీ.సత్యమూర్తి. ఆయన అజ్ఞాతవాసం చేస్తూ శివసాగర్‌గా, విప్లవ కవితోద్యమానికి సారథ్యం వహించాడు. విప్లవ దార్శనికుడిగా, బావుకుడిగా అద్భుతమైన వచన కవిత్వంతో పాటు, పాటను కూడా ఆహ్వానించాడు. అప్పట్లో శ్రీశ్రీ సైతం శివసాగర్ పాట "నరుడో భాస్కరుడా'ను ఆలపిస్తూ... ఊరూరా తిరిగిన పరిస్థితి తెలిసిందే. 1980లలో సీతారామయ్య నిర్బంధంలో ఉన్న కాలంలో పీపుల్స్ వార్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత కాలంలో పార్టీలు విభేదాల కారణంగా బయటకొచ్చాడు. 1990లో జరిగిన రెండు దశాబ్దాల విప్లవ రచయితల సంఘం సభల్లో సత్యమూర్తి అజ్ఞాతం వీడి బయటకు రావడం పెద్ద సంచలనం. ఆ తర్వాత ఆయన అధ్యయనం అంబేద్కర్ మార్గంగా సాగింది. దళిత బహుజన రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాడు. విప్లవ పార్టీల ఆచరణపై కుల సమస్యపై వారి అవగాహనపై సత్యమూర్తి చేసిన విమర్శలు చాలా వివాదాస్పదమయ్యాయి. అప్పుడప్పుడే బలం పుంజుకుంటున్న దళిత ఉద్యమానికి సత్యమూర్తి గొప్ప భరోసా అయ్యాడు.
అయితే, ఎంతో కాలంగా తాను నమ్మకం ఉంచిన మార్క్సిజాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. విప్లవ పార్టీల నాయకత్వాన్ని ప్రశ్నించాడు. వర్గకుల పునాదిపై శక్తివంతమైన వ్యూహరచన చేయడం విప్లవ కర్తవ్యంగా అంబేద్కర్ తాత్విక, సామాజిక విశ్లేషణలను విప్లవోద్యమానికి అన్వయించుకోవాల్సిన అవసరాన్ని చెప్పాడు. కార్యకర్తల త్యాగాన్ని అమరత్వాన్ని కీర్తించాడు. మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని జెమినీగా మేళవించి భారతీయ సమాజాన్ని వర్గకుల సమాజంగా సూత్రీకరించాడు. ప్రత్యామ్నాయ సాహిత్య సంస్కృతిలో భాగంగా ఏకలవ్య, ఏదురీత వంటి పత్రికలు నిర్వహించాడు. చుండూరి మారణకాండ తరువాత దళిత ఉద్యమంలో కీలకపాత్ర పోషించాడు. చలపతి, విజయవర్ధనరావుల ఉరిశిక్ష రద్దు ఉద్యమానికి సారథ్యం వహించాడు. సాధారణ దళిత కుటుంబంలో పుట్టిన కంభం జ్ఞాన సత్యమూర్తి ఒక కమ్యూనిస్టు పార్టీ అధినేతగా ఎదగడమే కాక, సాహిత్య, సైద్ధాంతిక ఆధ్యాయనాల్లో, అసాధారణమైన మేధావిగా కొనియాడబడ్డారు. కవిగా ఆయనది అసాధారణమైన స్థానం. 1970ల తర్వాత రెండు దశాబ్దాలపాటు ఆయన పేరే ఉద్వేగభరితంగా వినిపించేది. కఠినమైన విప్లవ జీవితం, మృదువైన వ్యక్తీకరణ ఆయనలో ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. విప్లవాన్ని ప్రేమించే సాహిత్యం ఆయన దృష్టిలో "చిరుగాలి సితార సంగీతం". వయసు మీద పడినా ఇంకా విప్లవంలో కొనసాగాలని కోరుకుని "జీవితమా నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు" అని కాలాన్ని ప్రశ్నించాడు.
సత్యమూర్తి చరిత్రకు, భవిష్యత్తుకు ఎప్పటికీ ప్రాసంగికత ఉన్నవాడు. కమ్యూనిస్టు విప్లవకారుడిగా దళిత బహుజన, విప్లవకారుడిగా మన సమాజాన్ని మానవీకరించడానికి విప్లవీకరిగించడానికి వివక్ష లేని, అన్యాయం లేని, సమ సమాజం కోసమే ఆయన ప్రయాణం సాగింది. ఆయన అక్షరం తెలుగు సాహిత్యానికి ఒక అలంకారశాస్త్రం. అందుకే కాలం కడుపుతో ఉండి శివసాగర్‌ని కన్నది. కాలానికి ఒక కవి కావాలి. ఒక కవిత కావాలి. ఈ యుగం పాడుకునేందుకు ఒక పాట కావాలి. అందుకనే ఈ యుగం శివసాగర్‌ను కనుగొన్నది. ఒక చేత గన్ను, మరోచేత పెన్ను పట్టుకొని, ఒక భుజం మీద సాంస్కృతిక విప్లవాన్ని, మరో భుజం మీద దళిత, బహుజన విప్లవాన్ని, ఒక భుజం మీద లాల్ సలామ్‌ను మరో భుజం మీద జై భీమ్‌ను మోస్తూ జీవితకాలమంతా తన పాదముద్రలు వదలివెళ్ళిన ఒక స్వాప్నికుడు కే.జీ. సత్యమూర్తి. = కళ్యా ణ్ కత్తి, సామాజిక విశ్లేషకుడు, 6303847077 (నేడు ఒంగోలులో సత్యమూర్తి 10వ వర్థంతి సభ)