వరద వచ్చినప్పుడుపైకి లేచి, నీరు తగ్గినప్పుడు కిందికి వెళ్లే.. ఇళ్లులు ఎక్కడున్నాయో తెలుసా ?
దిశ, ఫీచర్స్ : ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనే అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు వరద బీభత్సంతో విలవిల్లాడుతున్నాయి.
దిశ, ఫీచర్స్ : ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనే అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు వరద బీభత్సంతో విలవిల్లాడుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో దాదాపు 46 లక్షల మంది వరద ప్రభావానికి గురవగా సుమారు 31 మంది మరణించారు. ఇంకా లక్షలాది ప్రజలు రిలీఫ్ క్యాంపులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు ఏటా లక్షల మంది గూడు కోల్పోతుండగా, బాధితులకు తాత్కాలిక సాయమే తప్ప పునరావాసం దక్కడం లేదు.
ఇక నాలుగేళ్ల క్రితం కేరళ(2018) రాష్ట్రాన్ని కూడా వరదలు ముంచెత్తడంతో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వరదలు, తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సాంకేతికతలు లేదా డిజైన్స్ కోసం అనేక చర్చలకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తిరువనంతపురానికి చెందిన నన్మ గిరీష్, తన స్నేహితుడు బెన్ కె జార్జ్ కలిసి 'ఉభయచర గృహాలు(ఆంఫిబియస్ హోమ్స్)' ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఈ గృహాల ప్రత్యేకత ఏంటి? వరద ప్రాంతాల్లో ఎలాంటి ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాం.
కేరళకు చెందిన నన్మా, బెన్.. ఎంటెక్ తర్వాత పీహెచ్‌డీ చేసేందుకు నెదర్లాండ్స్ వెళ్లారు. ఆ సమయంలోనే అక్కడి డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ(TU డెల్ఫ్ట్)లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం వచ్చింది. మొదటిసారిగా 'ఆంఫిబియస్ హోమ్స్'ను అక్కడే చూసింది నన్మ. చూసేందుకు సాధారణ ఇంటి మాదిరి కనిపించినా వరద ముంచెత్తినప్పుడు నీటిపై తేలియాడటమే దాని ప్రత్యేకత. బలమైన కాంక్రీటుతో తయారు చేయబడే ఈ ఉభయచర గృహాలు.. గైడెన్స్ పోస్ట్‌లు లేదా పిల్లర్ కాంపోనెంట్స్ ద్వారా పైకి లేస్తాయి. వరద నీరు తగ్గిన తర్వాత భవనం తిరిగి యథాస్థానానికి చేరుకుంటుంది. ఈ సాంకేతికతను వరద పీడిత ప్రాంతాల్లో ఉపయోగిస్తుండగా.. ఈ తరహా భవనాలు నెదర్లాండ్స్, యూకే, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్‌లో విస్తృతంగా ఉన్నాయి. మూడంతస్తుల వరకు నిర్మించగల ఈ ఇళ్ల నమూనాలు సాధారణ కాంక్రీట్ ఇళ్లతో పోల్చినప్పుడు సరసమైనవి. అంతేకాదు వీటి నిర్మాణానికి ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్యానెల్స్ ఉపయోగిస్తారు కాబట్టి సిమెంట్ వాడకం తక్కువగా ఉంటుంది. సైట్ పరిస్థితులు, క్లయింట్ నిర్దిష్ట అవసరాలను బట్టి ధర రూ. 1,500/sqft నుంచి రూ. 2,700/sqft వరకు ఉంటుంది.
స్టార్టప్ :
'ఆంఫిబియస్ హోమ్స్'పై 2018లో తన థీసిస్ సమర్పించినప్పుడు నన్మ ప్రశంసలు అందుకుంది. అయితే ఆ ఏడాది కూడా కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో ఆ అంశం జాతీయ చర్చగా మారింది. ఈ పరిస్థితులే నన్మ, బెన్‌లను ఫ్లోటింగ్ హౌస్ గురించి ఆలోచింపజేసింది. దీంతో 2019లో 'నెస్ట్‌అబైడ్' పేరుతో ఉభయచర గృహ నిర్మాణాన్ని చేపట్టే స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఇంటర్ డిసిప్లినరీ సంస్థ కాగా.. వరదలకు ముందు, తర్వాతి పరిస్థితుల్లో ఉపయోగించే సాంకేతికతలపై పని చేయడంతో పాటు ప్రధానంగా ప్రజల కోసం ఉభయచర గృహాలు నిర్మించడంపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే 2020 లాక్‌డౌన్ టైమ్‌లో తమ సంస్థ తరఫున డ్యామ్‌లపై పనిచేయడం మొదలుపెట్టిన వీరిద్దరూ.. డ్యామ్‌లు తెరిచినప్పుడు లేదా నదికి వరద సంభవించినపుడు అవి ఎలా విస్తరిస్తాయో గుర్తించేందుకు నదుల వరద నమూనాపై ప్రాజెక్ట్స్ చేశారు.
తొలి ఇల్లు :
2021,సెప్టెంబర్‌లో కొట్టాయం జిల్లాలోని కురవిలంగాడ్‌లో తమ సొంత నిధులతోనే 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో 'యాంఫీ నెస్ట్' పేరుతో తమ మొదటి ఇంటిని సిద్ధం చేశారు. దీన్ని కేరళ వ్యవసాయ మంత్రి పి ప్రసాద్ ప్రారంభించారు. ఈ ఇంటి నిర్మాణానికి దాదాపు రూ. 3లక్షలు ఖర్చయ్యాయని, తమ 'అంఫిబియస్' నమూనా ప్రకారం వరద వచ్చినప్పుడు ఈ ఇల్లు పైకి లేచి, నీరు తగ్గినప్పుడు సాధారణ స్థాయికి చేరుకుంటుందని వివరించారు. ప్రస్తుతం వాళ్లు కేరళ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ కౌన్సిల్ (K-DISC) కింద ప్రాజెక్ట్‌లపై పని చేస్తున్నారు. మున్రో ద్వీపం, కుట్టనాడ్ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇలాంటి ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వరదలను తట్టుకునేలా తాము రూపొందిస్తున్న ప్రాజెక్ట్స్, కేరళలోని వాటర్ ప్రాజెక్ట్స్‌కు అందిస్తున్న సహకారం వల్ల ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో 'నెస్ట్ అబిడ్' వ్యవస్థాపకులు నన్మ గిరీష్, బెన్ కె జార్జ్‌కు చోటు దక్కడం విశేషం. ఇక తమ భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించిన నన్.. త్వరలోనే తమ మోడల్‌ను వాణిజ్యీకరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది.
ఉచిత ఇల్లు :
'కేరళలో 2018, 2019 వరదల్లో లేదా వరదలు సంభవించే ప్రాంతంలో నివసిస్తూ ముంపునకు గురైన వాళ్లు ఎవరైనా మీకు తెలిస్తే, వారి వివరాలను మాతో పంచుకోవచ్చు. క్రౌడ్ ఫండెడ్ మనీ ద్వారా లేదా CSR ద్వారా వారికి మేము ఉచిత ఆంఫిబియస్ ఇల్లు నిర్మించి ఇస్తాం. ఈ ఇన్షియేటివ్‌లో మీరు భాగం అవ్వండి' అని NestAbide వెబ్‌సైట్ పేర్కొంది.
మీనాచిల్ నది ఒడ్డున ఉండే హరి మోహన్ అనే వ్యక్తి కొత్త ఇల్లు కట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఆ ప్రాంతంలో వరదలు సంభవించినపుడు నీరు 6 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది. మా NestAbide నిర్మిస్తున్న ఉభయచర గృహ కార్యక్రమాల గురించి విని అతను మా దగ్గరకు వచ్చాడు. తన అవసరాలకు అనుగుణంగా సాంప్రదాయక గృహం కంటే తక్కువ ధరలో ఉండే ఉభయచర గృహాన్ని అతనికి నిర్మించి ఇవ్వనున్నాం. రెండతుస్తుల్లో నిర్మించనున్న ఈ భవనంలో ఒక అంతస్తు భూగర్భంలో ఉంటుంది. ఇది వరదలు వచ్చినప్పుడు పైకి తేలుతుంది. ప్లానింగ్ అంతా పూర్తయింది, వర్షాలు పడిన తర్వాత సెప్టెంబర్‌లోగా కన్‌స్ట్రక్షన్ ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం మేము KDISC(కేరళ డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ అండ్ స్ట్రాటజిక్ కౌన్సిల్) తరఫున కుట్టనాడ్, మున్రో ద్వీపంలోని వరద ముంపు ప్రాంత ప్రజల కోసం ఒక ఉభయచర గృహ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాం.
- నన్మ అండ్ బెన్