దిశ, అమీన్ పూర్ : దళితులు ఆర్థికంగా ఎదగాలని సామాజిక ఉద్యమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని.. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు తీసుకువచ్చారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్‌చేరు పట్టణంలో మైత్రి గ్రౌండ్స్‌లో నియోజకవర్గ పరిధిలో బచ్చుగుడెం, కొడకంచి, ఆనంతారం గ్రామలకు చెందిన 100 మందికి వాహనాలు, యూనిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఇందులో 39 మందికి ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, 32 మందికి డైరీ యూనిట్లు, ఐదు మందికి మేకల ఫార్మ్‌లు, నలుగురికి పౌల్ట్రీ ఫార్మ్‌లు, నలుగురికి కిరాణా షాపులు, మహిళ లబ్ధిదారులకు ఫాన్సీ షాప్, బ్యూటీ పార్లర్, క్లాత్ ఎంపోరియం తదితర వ్యాపార యూనిట్లకు దళిత బంధు ద్వారా రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో దళితులు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకుని ఆ రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి లేక అప్పుల పాలయ్యారన్నారు. ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, వ్యాపార రంగంలో రాణించేలా వారికి చేయూతనందిస్తూ ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల సహాయాన్ని సీఎం కేసీఆర్ ఈ పథకం ద్వారా అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఈ ఆర్థిక సంవత్సరానికి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి దళిత బంధు పథకం ద్వారా చేయూతను అందిస్తామని భరోసా ఇచ్చారు.
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో దళిత బంధు ద్వారా వాహనాలు పొందిన లబ్ధిదారులకు స్థానిక పరిశ్రమలతో మాట్లాడి వారి వాహనాలకు పరిశ్రమలతో అనుసంధానం చేశామని తెలిపారు. రాబోవు రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, మాజీ ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నాగేశ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సల్లగా ఉండాలి.. : లావణ్య, బచ్చు గూడెం
బ్యూటీషియన్ గా ఉద్యోగం చేసే నాకు దళిత బంధు పథకం ద్వారా బ్యూటీ పార్లర్ యజమానిని చేశారు. జీవితంలో సొంత వ్యాపారం మొదలు పెడతాను అనుకోలేదు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వల్లే సాధ్యమైంది. సీఎం కేసీఆర్ పది కాలాల పాటు చల్లగా ఉండాలి.
డ్రైవర్ గా ఉన్న నన్ను ఓనర్‌ని చేశారు..: శ్రీకాంత్ లబ్ది దారుడు.
'ఇంతకాలం జేసీబీ డ్రైవర్‌గా రూ.10 వేల జీతనికి పని చేస్తూ.. చాలీచాలని వేతనంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా జేసీబీ కొనుగోలు చేశామను. డ్రైవర్‌గా ఉన్న నన్ను జేసీబీ యజమానిగా చేసిన సీఎం కేసీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను' అని శ్రీకాంత్ అన్నాడు.