టీఆర్ఎస్‌కు మరో భారీ షాక్.. జూపల్లి సంచలన నిర్ణయం!

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు..Jupally planning to quit TRS, to join BJP?

Update: 2022-03-10 15:47 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. 2018 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలుకావడం, కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారిక కార్యక్రమాల సంగతి అటుంచి, కనీసం పార్టీ కార్యక్రమాలలోనూ ఆయనకు ప్రాధాన్యత లభించలేదు. ఆయన అనుచర వర్గం పలుమార్లు పార్టీ మారాలని ఒత్తిడి చేసినప్పటికీ ఇప్పటికైనా పార్టీ గుర్తించకపోతే ఉందా అన్న ఆశాభావంతో అదే పార్టీలో కొనసాగారు. పార్టీ రాష్ట్ర నేతలు పట్టించుకోకపోయినా.. తనకు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోయినా అడ్డుకుంటూ వచ్చారు.

మరోవైపు తన అనుచరవర్గం చేజారకుండా ఎప్పటికప్పుడు వాళ్లతో మాట్లాడుతూ... సమావేశాలు నిర్వహించుకుంటూ రావడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా తనను గుర్తించకపోతుందా అన్న ఆశ ఆయనలో ఉండేది. ఆ కారణంగానే అన్నీ అవమానాలను అధిగమిస్తూ తన క్యాడర్ కు నచ్చజెప్తూ వచ్చారు. పార్టీ సభ్యత్వం కోసం పుస్తకాలు అందకపోవడం, ఇటీవల వనపర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభకు ఆహ్వానం రాకపోవడం వంటి కారణాలు ఆయనను మరింత బాధించినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గత మూడు నాలుగు రోజుల నుండి నియోజకవర్గంలోని అన్ని మండలాలు తిరుగుతూ అనుచరవర్గంతో చర్చలు నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీలో చేరే అంశం కొన్నాళ్లు వాయిదా వేసుకున్నామని భావించినప్పటికీ.. అధికార పార్టీ నేతలు ఇక తనను పట్టించుకునే పరిస్థితులు కనిపించడంలేదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే గురువారం బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. రాష్ట్రస్థాయి నేతలతో మాట్లాడిన తర్వాత ఆయన, కొంతమంది ముఖ్య అనుచరవర్గంతో కలిసి హైదరాబాద్ లో కొంతమంది ముఖ్యనేతలతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన చేరిక పట్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం, గురువారం వివిధ రాష్ట్రాలకు సంబంధించి వెలువడిన ఫలితాలు సైతం బీజేపీకి అనుకూలంగా రావడంతో తప్పనిసరిగా ఆయన బీజేపీలోనే చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇందుకోసం శుక్రవారం తన అనుచరవర్గంతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News