దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పి ఎదురైంది. చంద్రబాబు నాయుడు తన భూమిని ఆక్రమించారంటూ జనసేన పార్టీ కార్యకర్త నిరసనకు దిగారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద అదే ప్రాంతానికి చెందిన జనసేన నేత శింగంశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి నిరసనకు దిగారు. ఆయనకు జనసేన పార్టీ నేతలు సైతం మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఫ్లెక్సీలను సైతం ప్రదర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌లు దయచేసి మా స్థలాన్ని ఖాళీ చేసి ఇవ్వండి. లేదా నష్టపరిహారం అయినా ఇవ్వండి అంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. జనసేన పార్టీ నేత, రైతు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఇంటికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం తన 8 సెంట్ల తన భూమిని తీసుకున్నారని.. కరకట్ట నివాసం ఖాళీ చేయగానే తిరిగి స్థలాన్ని ఇస్తామని అప్పట్లో లిఖితపూర్వకంగా అధికారులు రాసిచ్చినట్లు తెలిపారు.
అప్పట్లో నష్టపరిహారం కూడా చెల్లిస్తామని చెప్పారని కానీ ఇప్పటికీ ఏడేళ్లు దాటుతున్నా నష్టపరిహారం ఇవ్వడం లేదని వాపోయాడు. ఇప్పటికైనా నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబును అడిగితే ఆ ఇల్లు లింగమనేని రమేశ్‌ది కాబట్టి.. ఆయనతో మాట్లాడుకోవాలంటూ చంద్రబాబు సెక్యూరిటీ అధికారులు సమాధానం చెబుతున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఇలా రోడ్కెక్కాల్సి వచ్చిందన్నారు. అయితే చంద్రబాబు నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.