మంత్రి హరీష్ రావును ప్రశ్నించిన జగ్గారెడ్డి.. ఆ జలాలు ఎప్పడొస్తాయి..?

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: కాళేశ్వరం జలాల తరలింపులో భాగంగా మల్లన్న- latest Telugu news

Update: 2022-03-15 11:25 GMT

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: కాళేశ్వరం జలాల తరలింపులో భాగంగా మల్లన్నసాగర్​నుంచి గోదావరి జలాలను సంగారెడ్డి పట్టణ సమీపంలోని మహబూబ్​సాగర్​చెరువులోకి తరలిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్​రావులు గతంలో చెప్పారని ఆ పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్​రెడ్డి(జగ్గారెడ్డి) అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీష్​రావును అడిగారు. గోదావరి జలాలను చెరువులోకి తరలించడానికి ముందే అందులో ఉన్న కాలుష్య నీటిని పూర్తిగా తరలించాలని, చెరువును పూడిక తీస్తే బాగుంటుందన్నారు. ఈ చెరువుపై బెస్తవాళ్లు, గంగపుత్ర కులాల వారు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని జగ్గారెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా పట్టణ శివారులోని శిల్పారామం పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయించాలని మంత్రిని కోరారు. వితంతువులు, 65 ఏండ్లు నిండిన వారు గత మూడేళ్లుగా దరఖాస్తులు చేసుకుంటున్న పింఛన్లు మంజూరు చేయడం లేదు.

అధికారులు బడ్జెట్​లేదని చెబుతున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్​కింద గతంలోనే చిరు వ్యాపారులు తీసుకున్న రూ.50 వేలలోపు రుణాలను మాఫీ చేయాలని జగ్గారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా అరటిపండ్లు, మిర్చిబజ్జీ, చిన్న కిరాణ దుకాణం, పానీపూరి వంటి చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి వ్యాపారం ఏ మాత్రం నడవలేదు. అలాంటి వారిని గుర్తించి రుణాలను మానవతా దృక్పథంతో మాఫీ చేసి ఆదుకోవాలని జగ్గారెడ్డి మంత్రి హరీష్​రావును కోరారు. జగ్గారెడ్డి చెప్పిన అంశాలను నోట్​చేసుకున్నామని సమాధానం ఇచ్చారు.

Tags:    

Similar News