డైలమాలో జగ్గారెడ్డి.. 21న సత్తా చూపిస్తాడా?
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: నియోజకవర్గ కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ గ్రౌండ్‌లో లక్ష మందితో భారీ సభ ఏర్పాటు చేస్తా,
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: నియోజకవర్గ కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ గ్రౌండ్‌లో లక్ష మందితో భారీ సభ ఏర్పాటు చేస్తా, ఈ నెల 21న నిర్వహించే సభతో రాజకీయంగా తన సత్తా ఏమిటో చూపిస్తానని శపథం చేసిన జగ్గారెడ్డి డైలామాలో పడినట్లు తెలుస్తోంది. ఆ రోజున జగ్గారెడ్డి సభ ఉంటుదా..? ఉండదా..? అనే అంశంపై సంగారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో కూడా విస్త్రతంగా చర్చ జరుగుతున్నది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే జగ్గారెడ్డి సభను వాయిదా వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల 15 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే జీరో అవర్‌లో నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా తాను ఎమ్మెల్యేగా 2013లో సదాశివపేట మండలం సిద్దాపూర్లో 5 వేలు, కొండాపూర్ మండలం అలియాబాద్‌లో 4 వేల మంది పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే ఆ తరువాత ప్రభుత్వాలు మారిపోవడం, వివిధ కారణాలతో ఇప్పటికీ ఆ పేదలకు పొజీషన్ ఇవ్వలేదు. ప్రభుత్వం ఇచ్చిన ఆ పట్టాలకు తక్షణమే పొజీషన్ చూపించాలని సభలో చర్చించడానికి జగ్గారెడ్డి చూస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే సభలో మాట్లాడే అవకాశం కోసం అసెంబ్లీకి తప్పని సరి వెళ్లాల్సి ఉందని దగ్గరి వాళ్లతో జగ్గారెడ్డి అన్నట్లు తెలిసింది. 15తో సమావేశాలు ముగిసిన తరువాత సభకు కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉండనున్నది. ఆ సమయంలో ఏర్పాట్లుకు ఇబ్బంది అవుతుందని జగ్గారెడ్డి భావిస్తున్నారని సమాచారం.దీంతోనే ముందు అనుకున్న 21న సభ నిర్వహించే అవకాశాలు లేవని చెబుతున్నారు. కొద్ది రోజుల వరకు సభను వాయిదా వేయనున్నట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా జగ్గారెడ్డి నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ విస్త్రతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ సంగారెడ్డి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, సదాశివపేట మున్సిపాలిటీకి రూ.25 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిధులను అన్ని వార్డులకు సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వార్డుల పర్యటన చేపట్టారు. ఇప్పుడే ఎన్నికలు వచ్చాయా..? అనే తరహాలో ఆయన హంగామా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తన పర్యటనలతో కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
యూపీ ఫలితాలతో డైలమాలో జగ్గారెడ్డి..
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, గోవా, మణిపూర్, పంజాబ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌నేతలకు షాకిచ్చాయి. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్బొక్కబోర్లా పడడంతో ప్రధానంగా టీపీపీ వర్కింగ్‌ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డైలమాలో పడినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించడం ఆ తరువాత పార్టీ నేతలు ఆయనను బుజ్జగించడం, చివరకు సోనియా, రాహుల్‌గాంధీలను కలిసి వచ్చిన తరువాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరా పరాభవాన్ని మూటగట్టుకున్నది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో మౌనం నెలకొంది. ఇలాంటి సందర్భంలో సంగారెడ్డిలో భారీ సభ పెట్టడం అవసరమా..? అనే కోణంలో కూడా జగ్గారెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. యూపీ ఫలితాల నేపథ్యంలో షాక్‌లో ఉన్న సోనియా, రాహుల్‌లు ఇప్పట్లో జగ్గారెడ్డితో చర్చించడానికి సమయం ఇస్తారా..? అనే అంశంపై కూడా చర్చ జరుగుతున్నది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారనేది రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నది.