దిశ ప్రతినిధి, సంగారెడ్డి: భారత రాజ్యాంగాన్ని తిరిగారాయాలనడం సిగ్గు చేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ శవ శోభ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు చేసిన విధానం గురించి మోడీ మాట్లాడారని, దీనిపై టీఆర్ఎస్ నాయకులు విష ప్రచారం చేసి సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ గురించి ఉభయ సభలో కేసీఆర్ కంటే ఎక్కువ గళమెత్తింది సుష్మా స్వరాజ్ గారు అని గుర్తు చేశారు.
బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక అధికార పార్టీ నాయకులు మోడీ మీద, బీజేపీ మీద విషం కక్కుతున్నారన్నారు. వాజ్పేయ్ హయాంలో ఎలాంటి ఉద్రిక్తత లేకుండా 3 రాష్ట్రాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తే టీఆర్ఎస్ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడు ఏండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు..? ఎన్ని ఎకరాల భూమి దళితులకు ఇచ్చారు.? ఎన్ని రెండు పడకల ఇల్లు కట్టి పేదలకు పంచారు..? ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇస్తున్నారు..? ఎన్ని ఊర్లకు పూర్తిగా భగీరథ నీళ్లు ఇచ్చారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణలో బీజేపీ ప్రభావం పెరగటంతో బీజేపీ పై అసహనం పెరిగి సాక్ష్యత్తు ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, జిల్లా కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, దేశ్పాండే శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మహేందర్, హనుమంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మణరావు సత్యమ్మ, జిల్లా కార్యదర్శి మురళీధర్ రెడ్డి, బైండ్ల కుమార్ విష్ణువర్ధన్ రెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడు పవన్, దళిత మోర్చా అధ్యక్షుడు యశ్వంత్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మహేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి, సంగారెడ్డి మండల అధ్యక్షుడు పాపయ్య, పల్లి మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, కొండాపూర్ మండల అధ్యక్షులు సాయి పాల్గొన్నారు.