'ధరణి' నిండిందా? 21 నెలలకే హార్డ్ డిస్క్ ఫుల్
రాష్ట్రంలో ధరణి పోర్టల్ హల్‌చల్ సృష్టిస్తున్నది. ఏ నోట విన్నా అదే మాట. ప్రాపర్టీ కలిగిన ప్రతి కుటుంబంలోనూ అదే చర్చ. 21 నెలల్లోనే వేనోళ్ల కీర్తింపబడినా.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ధరణి పోర్టల్ హల్‌చల్ సృష్టిస్తున్నది. ఏ నోట విన్నా అదే మాట. ప్రాపర్టీ కలిగిన ప్రతి కుటుంబంలోనూ అదే చర్చ. 21 నెలల్లోనే వేనోళ్ల కీర్తింపబడినా.. ప్రస్తుతం దుమ్మెత్తుపోస్తున్నారు. లక్షలాది మంది దాని బారిన పడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తప్పులతడక డేటా అప్ లోడ్‌తో సమస్యల కుప్పగా తయారైంది. రెండేండ్లు తిరగక ముందే డేటా ఫుల్ అయినట్లు తెలుస్తున్నది. ఇప్పటి దాకా ఏ స్థాయి హార్డ్ డిస్కులు ఏర్పాటు చేశారో తెలియదు. కానీ తాజాగా మరో ఆరు సాలిడ్ స్టేట్ డ్రైవ్స్(ఎస్ఎస్డీ)లను ఇన్స్టాల్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కటి 3.84 టెరాబైట్స్ స్పేస్ కలిగి ఉండేవి అంటే.. 23.04 టెరాబైట్స్ ఉండనుంది. ధరణి ప్రాజెక్టుకు ఆరు ఎస్ఎస్డీ(సాలిడ్ స్టేట్ డ్రైవర్స్) డిస్కుల కోసం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తరఫున తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నది. గురువారం ఈ మేరకు ఆరింటిని ఇన్ స్టాల్ చేయనున్నారు.
అయితే పోర్టల్ నిర్వహణపై అనేక అనుమానాల మధ్య అప్పుడే డేటా ఫుల్ కావడం విస్మయానికి గురి చేస్తున్నది. పైగా సీసీఎల్ఏ చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేర్పులు, మార్పులు వంటి అత్యంత విలువైన అంశాలన్నింటినీ టీఎస్టీఎస్ చేతిలో పెట్టారు. రూ.లక్షల కోట్ల విలువైన భూమి హక్కులు భద్రమేనా? ఎలాంటి ట్యాంపరింగ్ చేయలేని రికార్డు అన్న సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఎంత వరకు నిజం? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే అనేక అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో మరోసారి ధరణి భద్రత చర్చనీయాంశంగా మారింది.
లక్షల్లో దరఖాస్తులు
పేరులో అక్షరం తప్పుపడినా అన్ని ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్ లోడ్ చేయాలి. ఇక హక్కులను నిరూపించుకోవాలంటే లెక్కకు మించిన డాక్యుమెంట్లన్నీ సమర్పించాలి. ఒక్కో దరఖాస్తు వెంట పదుల సంఖ్యలో పేజీలు జత చేయాల్సిందే. రిజెక్ట్ చేస్తే మళ్లీ అప్ లోడ్.. ఇలా రెండు, మూడు, నాలుగు సార్లు.. కలెక్టర్ దయతలచి ఆమోదించే వరకు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. దాంతో ధరణి పోర్టల్ డేటా నిండినట్లుంది. 32 జిల్లాల్లోని ప్రతి తహశీల్దార్ కార్యాలయం ధరణి పోర్టల్ బాధితులతో సందడిగా ఉంటున్నది. 2021 వానాకాలం లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 7,37,763 మంది రైతులు ఉన్నారు. అంటే పోర్టల్‌లో అన్ని ఖాతాలు ఉన్నాయన్న మాట. రెండేండ్లలోపే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు నిండిపోతే రానున్న కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు పోర్టల్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న కంపెనీపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ జోరుగా వస్తున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్ఐసీ వంటి ఎన్నో పేరు ప్రఖ్యాతులు గాంచిన సంస్థలు ఉండగా దానికే ఎందుకు కట్టబెట్టారన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. ఇప్పటి తప్పులకు ఆ సంస్థ బాధ్యతలు లేకపోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా మేలైన, జవాబుదారితనం కలిగిన సంస్థకు అప్పగించాలని ధరణి బాధితులు ప్రభుత్వానికి లేఖలు కూడా రాయడం విశేషం. డేటాను ఎలా పదిలపరుస్తారోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ధరణి పోర్టల్ సృష్టించిన తప్పులు ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి.