2020, డిసెంబర్ తర్వాత అత్యధికంగా భారత చమురు దిగుమతులు!
దిశ, వెబ్‌డెస్క్: భారత ముడి చమురు దిగుమతులు ఫిబ్రవరిలో ..telugu latest news
దిశ, వెబ్‌డెస్క్: భారత ముడి చమురు దిగుమతులు ఫిబ్రవరిలో రోజుకు 4.86 మిలియన్ బ్యారెల్స్(48.6 లక్షల బ్యారెళ్ల)కు పెరిగాయని వాణిజ్య విభాగం ప్రాథమిక గణాంకాలు పేర్కొన్నాయి. ఇది 2020, డిసెంబర్ తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. అలాగే, ఈ ఏడాది జనవరిలో జరిగిన చమురు దిగుమతుల కంటే 5 శాతం, గత ఏడాది ఇదే నెలలో దిగుమతి చేయబడిన ముడి చమురు కంటే ఈసారి 24 శాతం పెరిగాయి. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు రిఫైనరీ కంపెనీలు దిగుమతులు పెంచాయని గణాంకాలు తెలిపాయి. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం ఆంక్షలు తొలగించడం వంటి పరిణామాలతో దేశవ్యాప్తంగా ఇంధన అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందనే కారణంతో చమురు శుద్ధి కంపెనీలు దిగుమతులను క్రమంగా పెంచుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
భారత్ ప్రతి ఏటా అవసరమైన మొత్తం ముడి చమురులో 80 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా భారత్ మధ్యప్రాచ్యం నుంచి ముడి చమురు దిగుమతులను క్రమంగా తగ్గిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి చౌకైన చమురు లభిస్తుండటంతో ఒపెక్ దేశాల వాటా తగ్గిపోతుంది. గత నెల కెనడా, అమెరికాల నుంచి దిగుమతి చేసుకునే చమురు వాటా అత్యధికంగా 14 శాతం పెరిగింది. ఆఫ్రికన్ ప్రాంతం నుంచి దిగుమతి అయ్యే చమురు వాటా నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకుందని గణాంకాలు వెల్లడించాయి.