ఆలోపే పూర్తి చేస్తాం.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) గురువారం ములుగు జిల్లాలో పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) గురువారం ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు దేవాదుల ప్రాజెక్టు(Devadula Project) పంపులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కీలక ప్రకటన చేశారు. 15 రోజుల్లో మరో మోటార్ ఆన్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, ఈ ఏడాది చివరికల్లా దేవాదుల ప్రాజెక్టు అన్ని దశల పనులు పూర్తి చేస్తామని ప్రకటన చేశారు. రెండున్నర దశాబ్దాలుగా దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో ఉందని అన్నారు. ఇందులో థర్డ్ ఫేజ్ దేవన్నపేట పంప్ హౌజ్‌ను తాము ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
600 క్యూసెక్కుల నీటిని ఈ మోటార్ ద్వారా ఎత్తిపోస్తున్నామని చెప్పారు. 15 రోజుల్లో మరొక మోటార్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో పూర్తిచేసి సాగు, తాగు నీరందిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన పుణ్యమా? అని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా అందరి సంక్షేమ కోసం పనిచేస్తున్నామని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్ట్ పనులు మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేయబోతున్నామని.. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల ఆలస్యం జరిగిందని అన్నారు.