ఇండియాలో వీధి కుక్క కెనడాకు వెళ్లింది.. ఎందుకో తెలుసా?!
ఎన్నో లక్షణాలు వాటిని ఉత్తమ పెంపుడు జంతువుగా చేశాయి. Indian Street Dog Being Adopted By Canadian Couple.
దిశ, వెబ్‌డెస్క్ః నిస్సందేహంగా కుక్కలు మానవుడికి మంచి స్నేహితులనడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. వాటికుండే విధేయత, విశ్వాసం, ఆప్యాయత, కుటుంబానికి రక్షణగా ఉండటం వంటి ఎన్నో లక్షణాలు వాటిని ఉత్తమ పెంపుడు జంతువుగా చేశాయి. అందుకే చాలా మంది కుక్కలు లేకుండా జీవితాలను ఊహించుకోలేరంటే అతిశయోక్తి కాదు. కుక్కకీ మనిషికున్న ఈ అవినావభావ సంబంధమే కుక్కల ప్రాణాన్ని కాపాడటానికి, వాటికి శాశ్వత నివాసం కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దయగల వ్యక్తులు ఉన్నారని నిరూపిస్తుంది. ఇలాంటిదే ఓ సంఘటన ఇంటర్నెట్‌లో అందిర హృదయాల్ని తాకింది.
రోడ్లపై ఆకలి కోసం అలమటిస్తూ తిరిగే ఓ కుక్క ప్రపంచ ప్రయాణం చేసి భారతదేశం నుండి కెనడాకు చేరింది. హవిలా హెగెర్ విలే, స్టీఫెన్ అనే జంటను కలవడానికే ఈ ప్రయాణమంతా. ఒకప్పుడు ఎన్నో వీధి కుక్కల్లా ఇది కూడా ప్రాణాలను నిలబెట్టుకోడానికి తీవ్రంగా శ్రమించేది. రాళ్ల దెబ్బలు తిని ఏడుస్తూ ఉండేది. అయితే, ఈ బాధలను నుండి రక్షించబడిన ఈ భారతీయ కుక్కను కెనడాలోని ఆ జంట దత్తత తీసుకున్నారు. అందుకే, ఓ వీధి కుక్క కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్‌లోకి ఖండాంతర ప్రయాణాన్ని చేసింది. ఇప్పుడది వీధి కుక్క కాదు, ఇండి! ఇది ఆ జంట తమ కొత్త ఫ్యామిలీ మెంబర్‌కి పెట్టుకున్న పేరు. ఈ జంట ఇండీని ఆహ్వానించడానికి వెళ్లిన సందర్భాన్ని వీడియో తీసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. అన్యోన్యతను చూపించే ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూవ్స్, లక్షల కొద్దీ లైక్‌లు వచ్చాయి. అంతేనా, టన్నుల కొద్దీ ప్రశంసలను అందుకున్నారు.