ఆర్టీఐ నుంచి మ‌మ్మ‌ల్ని తీసేయండి బాబోయ్‌.. `ఇండియ‌న్ ఆర్మీ` విన‌తి

Update: 2022-03-04 15:19 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇండియ‌న్ ఆర్మీలోని సాయుధ బలగాలు భార‌త ప్ర‌భుత్వానికి తాజాగా మ‌రో విన‌తి ప‌త్రాన్ని పంపించాయి. ఇందులో, భార‌త‌ సమాచార హక్కు (RTI) చట్టం నుండి సాయుధ బ‌ల‌గాల‌ను మినహాయించాలని విజ్ఞప్తి చేశాయి. చ‌ట్టంలో ఉన్న పార‌ద‌ర్శ‌క‌త వ‌ల్ల జాతీయ భ‌ద్ర‌త‌కు హాని క‌లగ‌డ‌మే కాకుండా కొన్ని ఆదేశాల‌తో రాజీ ప‌డుతున్న సంద‌ర్భాలు త‌లెత్తుతున్న‌ట్లు అందులో పేర్కొన్నారు. భార‌తదేశ‌ హోం, రక్షణ, రెవెన్యూ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి ప్రధాన‌ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో పాటు క్యాబినెట్ సెక్రటరీతో కూడిన ప్రభుత్వ కార్యదర్శుల కమిటీ ముందుకు ఈ అప్పీల్‌ను పంపిన‌ట్లు అధికారులు తెలియ‌జేశారు.

అయితే, రక్షణ మంత్రిత్వ శాఖలో భాగమైన మిలిటరీ వ్యవహారాల శాఖ ఈ ప్రతిపాదనను గత ఏడాది కూడా ప్రభుత్వానికి పంపింది. అప్ప‌ట్లో దేశ మొద‌టి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దీన్ని స‌పోర్ట్ చేశారు. దేశ‌ భద్రత, బాహ్య దురాక్రమణ, దేశంలో శాంతికి భంగం వాటిల్లకుండా రక్షించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఈ నివేద‌న పంపారు. కానీ, 2005లో చట్టం ప్రవేశపెట్టిన ద‌గ్గ‌ర నుంచి సాయుధ బలగాలను చట్టం నుంచి మినహాయించాలనే ముందస్తు ప్ర‌తిపాద‌న‌లు ఫలించలేదు.

ఇక‌, 2017-2020 సంవ‌త్స‌రాల‌ మధ్య ఆర్మీకి సంబంధించి 57,000 ఆర్టీఐ దరఖాస్తులు విశ్లేషించ‌గా, వాటిలో 986 మాత్ర‌మే తిరస్క‌రించారు. ఇవన్నీ ఆప‌రేష‌న‌ల్ ఎక్వీప్‌మెంట్స్‌, బోర్డ‌ర్‌ ఎన్‌కౌంటర్లు, దళాల కదలికలు, అంతర్గత భద్రతకు సంబంధించిన కార్యాచరణ వివరాలకు సంబంధించిన‌వి. వీటిలో ఎక్కువ‌గా సర్జికల్ స్ట్రైక్స్, ఎన్నికలు, డిఫెన్స్‌ కొనుగోళ్లు, కొత్త విధానాల రూపకల్పన వంటి జాతీయ పరిణామాలకు సంబంధించి జ‌రిగిపోయిన‌ సంఘటనల‌పై సమాచారం కోరిన‌వే. అయితే ఆర్టీఐ నుంచి సాయుధ బలగాలకు మినహాయింపునిచ్చే నిర్ణయంపై ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ మినహాయింపు సాధ్యం కాదని ప‌ర్స‌న‌ల్‌ మంత్రిత్వ శాఖ అంటుంటే, మినహాయింపు ఇస్తే పారదర్శకత గ‌ల‌ ఈ చట్టానికున్న విలువ త‌గ్గిపోతుంద‌ని న్యాయ మంత్రిత్వ శాఖ అంటోంది.

Tags:    

Similar News