Telangana News : రాష్ట్రంలో కాకమీదున్న రాజకీయం.. అస్త్రాలు సర్దుకుంటున్న పార్టీలు!

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాకమీదుంది. పొలిటికల్ టెంపరేచర్ డబుల్ హీటెక్కింది.

Update: 2022-04-11 04:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాకమీదుంది. పొలిటికల్ టెంపరేచర్ డబుల్ హీటెక్కింది. జాతీయ స్థాయి నేతలు రాష్ట్రం వైపు పరుగులు తీసేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర నేతలు గ్రామాల బాట పట్టారు. కేంద్రాన్ని టార్గెట్​చేస్తూ అధికార పార్టీ రోడ్డెక్కింది. నాయకుల పర్యటనలు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, పరస్పర విమర్శలతో పల్లె నుంచి పట్టణం వరకూ దద్దరిల్లుతున్నది. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఫలితాలతో బీజేపీ స్పీడ్‌ పెరిగింది. బీజేపీని టార్గెట్​చేస్తున్న కేసీఆర్‌కు, కనీసం పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు కొంత ఇబ్బంది తెచ్చి పెట్టాయి. ఇదే సమయంలో రాజకీయ వేడిపై గవర్నర్​మరింత ఆజ్యం పోశారు. ప్రొటోకాల్​పాటించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

మినీ పోరుతో బీజేపీ స్పీడ్

ఐదు రాష్ట్రాల ఎన్నికలను మినీ సమరంగా తీసుకున్న కమలం పార్టీ క్లియర్​కట్​మెజార్టీ సాధించింది. ఈ ఫలితాలతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం హీట్ ఎక్కింది. ఫ్రంట్ లేదు.. టెంటూ లేదూ అంటూ కమలనాథులు.. కేసీఆర్‌ను టార్గెట్​ చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న కేసీఆర్.. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ప్రయత్నాలకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు బ్రేక్​వేశాయి. ఒక దశలో ఈ మినీ సమరంలో బీజేపీకి ఎదురుగాలి తప్పదంటూ వ్యాఖ్యలు చేశారు. సీన్ రివర్స్ అయింది. సరిగ్గా ఈ పరిస్థితులే రాష్ట్ర బీజేపీ నేతలకు ఆయుధంగా మారాయి. కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు పెంచుతున్నారు.

దూకుడు పెంచిన కాంగ్రెస్

మరో వైపు కాంగ్రెస్​దూకుడు పెంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే టార్గెట్‌గా వరుస పోరుకు దిగుతున్నది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్​ గాంధీ.. రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బహిరంగ విమర్శలకు దిగిన నేతలను సమన్వయం చేసేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. అటు తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రానికి వ్యూహకర్తగా సునీల్​కనుగోలుతో ఒప్పందం చేసుకున్నారు. సునీల్ బృందం ఇచ్చిన నివేదికతో రాహుల్​గాంధీ రాష్ట్రంపై కన్నేశారు. కష్టపడితే.. రాష్ట్రంలో మళ్లీ పాగా వేసే అవకాశం ఉన్నదంటూ నేతలకు సూచనలు చేస్తున్నారు.

ఆప్ కీ కదమ్ ఔర్ ఆగే!

పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆప్​.. తెలంగాణపైనా దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు చేస్తున్నది. తమతో కలిసి రావాలంటూ ఆప్​అధినేత కేజ్రీవాల్​పలువురికి సంకేతాలిస్తున్నారు. టీజేఎస్​అధ్యక్షుడు కోదండరాంతో కూడా సంప్రదింపు జరుపుతున్నారు. ఉన్నత ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్​కుమార్, మాజీ ఐఏఎస్​ఆకునూరి మురళి వంటి వారితోనూ ఆప్​నేతలు టచ్‌లో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

జాతీయ నేతల రాచబాట

రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిన నేపథ్యంలో జాతీయ స్థాయి నేతల రాక పోకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బీజేపీ నేతలు రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారు. త్వరలోనే అమిత్​షా రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి అమిత్​షా ఈ నెల 14న రావాల్సి ఉండగా పర్యటన వాయిదా పడింది. పార్టీ జాతీయ నేతలు రాష్ట్రానికి ప్రతి వారం వస్తూనే ఉన్నారు. ఇక ఆప్​ అధినేత కేజ్రీవాల్​ఈ నెల 14న రాష్ట్రానికి రానున్నారు. కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీ ఈ నెలాఖరున రాష్ట్రానికి వచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. వరి ధాన్యం కొనుగోళ్లపై పోరు సాగిస్తున్న రాష్ట్ర నేతలకు మద్దతుగా ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

యాత్రలు..పాదయాత్రలు

రాష్ట్రంలో రాజకీయ యాత్రలు జోరందుకున్నాయి. బండి సంజయ్​ప్రజా సంగ్రామ యాత్ర మలి విడత మొదలవుతుండగా.. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నారు. అటు షర్మిల యాత్ర కూడా కొనసాగుతున్నది. బహుజన రాజ్యాధికారం పేరుతో అటు బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్​ ఆర్‌ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​యాత్ర చేస్తున్నారు. నియోజక వర్గాల్లో కాంగ్రెస్​ శ్రేణులు కూడా పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నాయి. రాష్ట్ర మంతా పాదయాత్ర చేయాలని అటు టీపీసీసీ చీఫ్ ​రేవంత్​రెడ్డి కూడా ప్లాన్ ​చేస్తున్నారు.

ఢిల్లీలో కేసీఆర్​.. రోడ్లపై మినిస్టర్లు

ధాన్యం అంశంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ​ఢిల్లీ వేదికగా పోరు సాగిస్తున్నారు. రాష్ట్రంలోనూ మంత్రులతో సహా ఆ పార్టీ నేతలు నిరసనలు చేస్తున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. పెట్రోల్,​డీజిల్​ధరల పెంపునకు నిరసనగా ఇటీవల టీఆర్‌ఎస్​నేతలు ఆందోళనకు దిగారు.

ఆజ్యం పోస్తున్న గవర్నర్​ అంశం

రాజకీయాలు హీట్​పెంచుతున్న నేపథ్యంలో గవర్నర్​అంశం మరింత ఆజ్యం పోస్తున్నది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నర్‌ను ఖాతరు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవలే వరంగల్, యాదాద్రి పర్యటనకు వెళ్లిన ఆమె తనకు ప్రొటోకాల్ దక్కలేదని పీఎం, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో కేసీఆర్​ సర్కారుకు, గవర్నర్‌కు మధ్య గ్యాప్​పెరిగినట్లు స్పష్టమైంది. ఇదే సమయంలో గవర్నర్​అవకాశం వచ్చినప్పుడల్లా గ్రామాలకు వెళ్తున్నారు. సీతారాముల కల్యాణానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. రాజ్ భవన్‌లో ప్రజా దర్బార్‌ నిర్వహించేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వంతో ఇబ్బందులు పడే వారంతా రాజ్​భవన్‌కు రావాలంటూ సంకేతాలిస్తున్నారు.

Tags:    

Similar News