వివాదంలో ఎమ్మార్డీసీ చైర్మన్ ఢిల్లీ పయనం.. పీకే రిపోర్ట్ ఎఫెక్టేనా..?
భారీ వర్షాలతో మూసీ ఉప్పొంగి.. ప్రజలు ఇబ్బందవుల్లో ఉంటే.. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ (ఎంఆర్‌డీసీ) చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడంపై విపక్షనేతలు భగ్గుమంటున్నారు.
దిశ, ఎల్బీనగర్: భారీ వర్షాలతో మూసీ ఉప్పొంగి.. ప్రజలు ఇబ్బందవుల్లో ఉంటే.. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ (ఎంఆర్‌డీసీ) చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడంపై విపక్షనేతలు భగ్గుమంటున్నారు. గత వారం రోజులుగా భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలు పోటెత్తడంతో హిమాయత్‌నగర్, గండిపేట చెరువుల గేట్లు ఎత్తివేశారు. దీంతో మూసీలోకి భారీగా వరదనీరు చేరుతుంది. భారీ వరదలతో చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జీలపై రాకపోకలను నిలిపివేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలైన పురానాపూల్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇబ్బందులను పరిష్కరించాల్సిన ఎమ్మార్డీసీ చైర్మన్ సుధీర్‌రెడ్డి సీఎం వెంట ఢిల్లీ పర్యటనలో ఉండడమేంటని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధులు వారికి అండగా ఉండాలి. కానీ ఇవేవి పట్టంచుకోమూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రజల ఇబ్బందులను గాలికొదిలేసి ఈ నెల 26న సీఎం కేసీఆర్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరుసటి రోజు ఉదయం నగరానికి చేరుకున్న ఆయన 27న తన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకుని వెంటనే తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇదే ఇప్పుడు ప్రతిపక్ష నేతలకు అస్త్రంగా మారింది. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ ఢిల్లీకి వెళ్లడం విమర్శలకు దారితీస్తుంది.
సీఎం దృష్టిలో పడేందుకేనా..?
గత కొంత కాలంగా ప్రశాంతి కిశోర్ (పీకే) సర్వే రిపోర్ట్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కలవరపెడుతున్నట్లు సమాచారం. దీంతో సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకే ఢిల్లీకి వెళ్లారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లేకపోతే సుధీర్‌రెడ్డికి ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమిటనీ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. భారీ వర్షాలతో ప్రజలు కష్టాల్లో ఉంటే సుధీర్‌రెడ్డి మాత్రం పుట్టినరోజు వేడుకలు, ఢిల్లీ టూర్‌లు చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మార్డీసీ పదవికి రాజీనామా చేయాలి
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. మూసీ అభివృద్ధిని గానీ, పరివాహక ప్రాంతాల ప్రజల కష్టాలను గానీ పట్టించుకోలేని సుధీర్‌రెడ్డికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. తన స్వలాభం కోసం తప్పా.. ఏనాడు సుధీర్‌రెడ్డి ప్రజల ఇబ్బందులను పట్టించుకున్న పాపాన పోలేదు. తాను తిరిగి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకునేందుకే ఢిల్లీకి వెళ్లారు. మూసీకి వరదలు పోటెత్తి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ పదవిలో ఉండి పట్టించుకోకపోవడం దారుణం. అందుకే ఆయన ఆ పదవికి అనర్హుడు. వెంటనే రాజీనామా చేయాలి.
సామ రంగారెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు
ఎమ్మెల్యేకు నైతిక బాధ్యత లేదా..?
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి నైతిక బాధ్యత మరిచి ఢిల్లీకి వెళ్లడం సిగ్గుచేటు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు భారీ వర్షాలకారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం, ఎమ్మార్డీసీ చైర్మన్ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం. ప్రజలు కష్టాల్లో ఉంటే.. స్థానిక ఎమ్మెల్యే గత నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాంవేయడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి టికెట్ రాదనే భయంపట్టుకుంది. అందుకే డిల్లీలో కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడానికి వెళ్లారు. ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా.. ప్రజలు ఓడించడం ఖాయం. ఎల్బీనగర్‌లో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం
మల్‌రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ ఇంచార్జ్