New Ration Cards: లబ్ధిదారుల ఎంపికకు 10 విధి విధానాలు.. ఆ తర్వాతే రేషన్ కార్డులు జారీ

రాష్ట్రంలోని పేదలకు కొత్తగా రేషన్‌కార్డులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది.

Update: 2025-01-14 03:30 GMT
New Ration Cards: లబ్ధిదారుల ఎంపికకు 10 విధి విధానాలు.. ఆ తర్వాతే రేషన్ కార్డులు జారీ
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పేదలకు కొత్తగా రేషన్‌కార్డులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఈనెల 26 నుంచి అర్హత కలిగిన కుటుంబాలకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత కార్డులను మంజూరు చేయనున్నారు. దరఖాస్తులను పూర్తిగా పరిశీలించాక కులగణన సర్వే ఆధారంగా రేషన్​కార్డులు లేని కుటుంబాల జాబితాను ఆయా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పంపుతారు. పాత విధానంలో ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర, పట్టణ ప్రాంతంలో రూ.2లక్షల ఆదాయం ఉండాలి. సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధం అవుతున్నది. మూడు నెలల క్రితం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాల పరిమితిపై అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదం లభించడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

కొందరి వివరాలు నమోదు కాలే!

పలు ప్రాంతాల్లో సర్వే చేసే సమయంలో అందుబాటులో లేనివారి పేర్లు నమోదు కాలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేస్తారా?, కులగణన ఆధారంగా చేస్తారనే అంశంపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. గ్రేటర్​హైదరాబాద్‌‌లో నేటికీ పలుచోట్ల సర్వే పూర్తి కాలేదని సమాచారం. వారికి రేషన్ కార్డులు వస్తాయా? అనే అంశంపై అనుమానం నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

2.81 కోట్ల లబ్ధిదారులు.. లక్షల్లో అర్జీలు 

రాష్ట్రంలో ఇప్పటికే 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో మొత్తం 2.81 కోట్ల మంది లబ్దిదారులుగా ఉండగా.. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్దిదారుల సంఖ్య 24 లక్షలుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు దాదాపు 10 లక్షలకు పైగా వచ్చాయి. ఇంకా, పెరగవచ్చని అధికారులు బావిస్తున్నారు.

కొత్త ఆహార భద్రత కార్డుల విధి విధానాలు:

1. కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లకు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపుతారు

2. మండల స్థాయిలో ఎంపీడీఓ, యుఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు

3. పర్యవేక్షకులుగా జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీసీఎస్ఓ

4. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డు సభలో ప్రదర్శించి, చర్చించిన తర్వాత ఆమోదం

5. గ్రామసభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్దిదారుల అర్హత జాబితాను మండల, మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్‌లో

నమోదు చేసి జిల్లా కలెక్టర్ / జీహెచ్‌ఎంసీ కమిషనర్ లాగిన్ పంపాలి

6. ఆ విధంగా పంపిన జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే కమిషనర్ లాగిన్‌కు పంపాలి

7. ఇది తుదిజాబితా ప్రకారం, సీసీఎస్​ కొత్త రేషన్ కార్డులు జారీ

8. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క ఆహార భద్రత (రేషన్) కార్డులో ఉండేలా చర్యలు

9. ఆహారభద్రత కార్డులలో సభ్యుల మార్పులు, చేర్పులు చేసేలా ఆప్షన్లు

10. కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి క్షేత్రస్థాయి పరిశీలన

Tags:    

Similar News