బాన్సువాడలో హీటెక్కిన రాజకీయం.. ఢీ అంటే ఢీ అంటున్న TRS, Congress, BJP
దిశ, బాన్సువాడ: బాన్సువాడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి..latest telugu news
దిశ, బాన్సువాడ: బాన్సువాడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పరిస్థితులు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో లీనమయ్యాయి. ముందస్తు ఎన్నికల ముచ్చటలో పడ్డాయి. బాన్సువాడ నియోజకవర్గంలో తాజాగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన, ప్రసంగంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తన వాగ్ధాటి, మాటల తూటాలతో విపక్షాలను మంత్రి ఓ ఆట ఆడుకున్నారు. మరోవైపు విపక్ష బీజేపీ తాను రేసులో ఉన్నానని ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ సైతం అధిష్టానం పిలుపు మేరకు ప్రభుత్వంపై పోరాటం సాగిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక గళాలు వినిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో స్థానికంగా జరుగుతున్న ఇసుక, మైనింగ్ మాఫియా రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువు అవుతుంది. ఎన్నడూలేని విధంగా దాడుల సంస్కృతి పెరిగిపోతుంది. తాజా జరుగుతున్న సంఘటనలే దీనికి నిదర్శనం.
బాన్సువాడ ఓ విభిన్న నియోజకవర్గం. ఇక్కడి పరిస్థితులు వేరు. జిల్లాలో ఇక్కడే సెటిలర్స్, ఎస్టీలు అధికంగా ఉంటారు. గెలుపోటములను ప్రభావితం చేసేంత కీలకం వీరు. అందుకే వీరికి అమిత ప్రాధాన్యం ఉంటుంది ఇక్కడ. అందుకే గిరిజనులు అధికంగా ఉండే వర్ని ప్రాంతానికి కేటీఆర్ రావడం, ఎస్టీలకు మేలు జరిగేలా సిద్దాపూర్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేయడం రాజకీయాల్లో కాకా రేపింది. అంతేకాదు ఏకంగా ప్రధానినే టార్గెట్ చేసి, కేటీఆర్ రెచ్చిపోవడం దుమారం రేపుతోంది. బీజేపీని ఇక్కడ గెలిపిస్తే, తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపేస్తారని, నార్త్ ఇండియాకే ఆయన ప్రధాని అంటూ సంబోధించడం చర్చగా మారింది. అదే సమయంలో అసెంబ్లీ స్పీకర్ పొచారంలాంటి నాయకుడు మాకు ఆదర్శమని కొనియాడటం రాజకీయ చతురతనే. పనిలో పనిగా తన ఆశీర్వాదం తీసుకున్న పోచారం తనయులను సభ సాక్షిగా భుజం తట్టడం కూడా ఓ ఎత్తుగడనే. సూక్ష్మంగా పరిశీలిస్తే తప్పా అర్థం కాని రాజకీయం ఇది. వాస్తవంగా చెప్పాలంటే తెరాసకు కేటీఆర్ పర్యటన మైలేజ్ పెంచిందనే చెప్పొచ్చు. ఇదే అదనుగా తెరాస ఎక్కడా తగ్గట్లేదు. వడ్ల కొనుగోలులో కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. తాజాగా వర్ని, మోస్రాలో జరిగిన గొడవల్లో బీజేపీతో అమితుమికి దిగింది. ఇక్కడే విపక్షాలకు మైండ్ బ్లాంక్ అవుతుంది. అందుకే తమ ఉనికి కాపాడుకునే, చాటుకునే ప్రయత్నంలో పడ్డాయి.
ప్రధాన ప్రతిపక్షంగా నిలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కేటీఆర్ పర్యటన కొంత కలిసొచ్చింది. యువకులతో నిరసన తెలపడంలో కొంత సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. నియోజకవర్గంలో బీజేపీ నిరసన, తెరాస నాయకులు అడ్డుకోవడం, పోలీస్ లాఠీఛార్జ్ స్థానిక జనాల్లో చర్చకు దారితీసింది. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వీళ్ళ నిరసనలు చక్కర్లు కొట్టాయి. బీజేపీ నియోజకవర్గ ఇంచార్జీ మాల్యాద్రి రెడ్డి ఇప్పుడిప్పుడే కీలక గిరిజన ప్రాంతాల్లో పాగాకు ప్రయత్నిస్తున్నారు. అందుకే స్వయంగా ఆయనే కేటీఆర్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేశారు. బాన్సువాడ జిల్లా కేంద్రం చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని గళం ఎత్తారు. తన పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జిపై తీవ్రంగా స్పందించారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, తెరాస వైఖరిని ఎండగట్టారు. స్పందించిన రాష్ట్ర నాయకత్వం గురువారమే తమ ఎమ్మెల్యే రఘునందన్ రావును బాన్సువాడకి పంపించింది. లాఠీచార్జిలో గాయపడిన కార్యకర్తలకు మనోదైర్యం నూరి పోయాలని ఆదేశించింది. హైకమాండ్ ఆదేశాల మేరకు రఘునందన్ రావు బాన్సువాడ పర్యటనలో మాటల తూటాలు పేల్చి అధికార పార్టీకి చెమటలు పట్టించారు. క్యాడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మనమే ప్రధాన విపక్షమని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉండబోతుందని కుండబద్దలు కొట్టారు. స్థానికంగా జరుగుతున్న ఇసుక దందాపై అధికార పార్టీని చెడుగుడు ఆడారు. మంత్రి కేటీఆర్‌కు సమానత్వం గురించే మాట్లాడే హక్కు లేదని, బాన్సువాడతో పోలిస్తే, జుక్కల్ వివక్షకు గురవుతుందని మండిపడ్డారు. బాన్సువాడను ఎందుకు జిల్లా చేయలేదని నేరుగా అసెంబ్లీ స్పీకర్, మంత్రి కేటీఆర్‌లపై బాణం సంధించారు. ఆయన మాటలతో కాషాయ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కలిగినట్లయింది.
అదే సమయంలో పార్టీ ఇంచార్జి మాల్యాద్రి రెడ్డి సెటిలర్ కావడంతో కీలకమైన సెటిలర్స్ ఓట్లకు ఢోకా లేదని పార్టీ ఓ అంచనాకు వచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు సైతం తమ పార్టీతో ఉన్నారనే సంకేతాన్ని ఆయన తెచ్చారని తెలుస్తుంది. తాజాగా డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి, తెరాస నాయకులు సురేందర్ రెడ్డిలను కొందరు మైనార్టీలు బాబర్ ఖాన్, సలీం ఖాన్ అని పిలుస్తారని బీజేపీ ఆరోపించి, విమర్శలు తారా స్థాయికి తీసుకెళ్లింది. అక్రమాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరింది. ఒక్కసారిగా జనం దృష్టిని ఆకర్షించడంలో, తాము గెలుపు రేసులో ఉన్నామని చెప్పడంలో సక్సెస్ అయిందనే చెప్పొచ్చు.
మరోవైపు కాంగ్రెస్ అనాదిగా ఇక్కడ కొట్లాడుతూ వస్తుంది. 1994 తర్వాత 2004 మినహా మళ్ళీ గెలుపు రుచి చూడలేదు. కానీ ప్రతిసారీ రెండో స్థానంలో నిలుస్తుంది. గ్రామ గ్రామాన క్యాడర్ బలంగా ఉంది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ తరచూ ధర్నాలు నిరసనలతో హోరెత్తిస్తుంది. కేటీఆర్ పర్యటన రోజే చలో ఎస్పీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. చాపకింద నీరులా కీలకమైన సెటిలర్స్ ఓటు బ్యాంకు భద్రం చేసుకునే పనిలో ఉంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ గణనీయమైన ఓట్లు సాధించింది. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పొందింది. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ కాదు స్వీపర్ అంటూ డిసిసి అధ్యక్షుడు మా మోహన్ రెడ్డి మాటల దాడి చేశారు. ఇసుక మాఫియాను పోచారం తనయులు నడిపిస్తున్నారని బలరాజ్ ఆరోపించారు. ఆదివారం రేవంత్ రెడ్డి సభకు నియోజకవర్గం నుంచి కార్యకర్తలను తరలించి నైతిక స్థైర్యం పెంచారు. ఈసారి ఎలాగైనా జెండా ఎగరేయాలని నాయకత్వం భావిస్తోంది. తమ నిరంతర పోరాటాలు కలిసి వస్తాయని అంచనా వేస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు ఇక్కడి నాయకులు.
ఈ పరిస్థితుల్లో ముక్కోణపు పోరాటం తప్పదని రాజకీయ విశ్లేషకుల అంచనా. వచ్చే రోజుల్లో రాజకీయాలు మారతాయని, అప్పుడు మరింత రాజకీయ వేడి తప్పదని తెలుస్తుంది. వలసల రాజకీయం మొదలైతే బలబలాలు మారొచ్చని అంటున్నారు. భవిష్యత్తులో మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.