Viral Video: వరుడు చెంప 2 సార్లు ఛెళ్లు, వధువు వాకౌట్.. ఇంతకీ ఏమైంది?! (వీడియో)
ఇప్పుడర్థమయ్యింది అందరికీ, అది చెంప ఛెళ్లే..?! Utter Pradesh bride slaps groom during Varmala ceremony.
దిశ, వెబ్‌డెస్క్ః Viral Video| పెళ్లి వేదిక దగ్గర అంతా సందడే సందడి.. పేరంటాళ్లు పాటలు పాడుతూ వరమాల కార్యక్రమాన్ని మోతమోగిస్తున్నారు. అకస్మాత్తుగా మరో మోత.. వరుడు చెంప ఛెళ్లు.. అందరూ తేరుకునే లోపే, మరోసారి చెంప ఛెళ్లు.. ఇప్పుడర్థమయ్యింది అందరికీ.. అది చెంప ఛెళ్లే..?! కానీ, ఎందుకలా..? ఎవ్వరికీ అర్థం కాలేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో వెనుక కథ ఇది!
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఓ వివాహ వేడుకలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జలౌన్ జిల్లా చమరి గ్రామం నుండి హమీర్‌పూర్‌కు పెళ్లి బారాత్ బాగానే జరిగింది. వరుడు సిద్ధంగా ఉన్నాడు. వధువు కూడా సిద్ధంగా ఉన్నట్లే అనిపించింది. కెమెరామెన్ పొజిషన్లో ఉన్నాడు, బంధువులు, స్నేహితులందరూ హాజరయ్యారు. వరుడు రవికాంత్ కాబోయే భార్యను చూస్తూ, రాబోయే భవిష్యత్తుపై కలలుగంటున్నాడు. కానీ, జరగబోయే పరిణామాన్ని ఊహించలేకపోయాడు. కమ్మగా నవ్వుతూ వధువు మెళ్లో వరమాల వేశాడు. అంతే, అతడి నవ్వు వాసన చూసిన వధువుకి చిర్రెత్తుకొచ్చిందేమో, చేతిలో మాలను విసిరి కొట్టి, లాగిపెట్టి ఒక్కటి పీకింది. ఏదో జరిగింది.. కానీ ఎవ్వరికీ అర్థం కాలేదు. క్లారిటీ కోసమేమో కానీ మరో సారి పీకింది. ఈసారి అందరికీ అర్థమయ్యింది. వరుడి చెంప ఛెళ్లుమనింది. ఒకటి కాదు రెండుసార్లు. అంతే, గ్యాప్ కూడా ఇవ్వకుండా వధువు పెళ్లి మండపం నుండి వాకౌట్ చేసింది. అయితే, ఇంతకీ వరుణ్ణి ఎందుకు చెంపదెబ్బ కొట్టాల్సి వచ్చిందో కారణం మాత్రం తెలియలేదు. ఆరా తీస్తే, వరుడు మద్యం తాగి వివాహ వేదిక వద్దకు వచ్చాడంటూ కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరిన తర్వాత పెళ్లి జరిగింది. పెళ్లి పూర్తయిన తర్వాత వధువు విదాయి కూడా జరిగింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో హమీర్‌పూర్‌లోని స్వాసా గ్రామానికి చెందినది.