AP News:సోషల్ మీడియా పోస్టుల పై ప్రత్యేక నిఘా.. అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్
సోషల్ మీడియాలో అసభ్యకరమైన, తప్పుడు పోస్టులు పెట్టే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పేర్కొన్నారు.
దిశ,రాజమహేంద్రవరం: సోషల్ మీడియాలో అసభ్యకరమైన, తప్పుడు పోస్టులు పెట్టే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలో అసభ్యకరమైన తప్పుడు పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు. యువత సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఏడాది ఏఫ్రియల్ 25న రమేష్ ఎస్విఎస్ కోచింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడని గుర్తు తెలియని వ్యక్తులు, ఫేస్‌బుక్, యూట్యూబ్, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన కోచింగ్ సెంటర్ పరువుకు భంగం కలిగించే విధంగా , విద్యార్థినుల ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకర పోస్టులు పెట్టినట్టు,దీనిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారని తెలిపారు. విశాఖ జిల్లా కోతరుట్లకు చెందిన దాసరి నాగేశ్వరరావు తప్పుడు పోస్టులు పెట్టడం పై 238/2024 అండర్ సెక్షన్ 500,469 ఐపీసీ ఐటీ చట్టం యొక్క సెక్షన్ 66-C,67 ప్రకారం రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పై కేసులో ముద్దాయిని గుర్తించి, బుధవారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు.