కొరవడిన అటవీశాఖ అధికారుల నియంత్రణ.. జేబులు నింపుకుంటున్న అక్రమార్కులు
దిశ, తిరుమలాయపాలెం: ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం..latest telugu news
దిశ, తిరుమలాయపాలెం: ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కోట్ల రూపాయలు వెచ్చించి మొక్కల పెంపకం చేపడుతోంది. మరోవైపు అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే సూత్రం కాస్త అధికారుల అలసత్వంతో టేబులు మీద తెరవని రికార్డులకే పరిమితమైంది. అటవీని రక్షించడంతో పాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పకడ్బందీగా వాల్టా చట్టం రూపొందించింది.
చెట్లను నరికి వేయాలంటే అటవీశాఖ, రెవెన్యూ శాఖ, సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అవేమీ లేకుండానే ఖమ్మం రూరల్ మండలంలో కట్టెల మండీలకు చెందిన కర్ర వ్యాపారస్తులు, ఇటుక బట్టీల వ్యాపారస్తులు అక్రమార్కుల అవతారమెత్తి తిరుమలాయపాలెం మండలాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. మండలపరిధిలోని తిరుమలాయపాలెం, వెదుళ్లచెరువు, పిండిప్రోలు, తెట్టెలపాడు, గోపాలపురం, దమ్మాయిగూడెం, బీరోలు, చంద్రు తండా, మహ్మదాపురం, సుబ్లేడు గ్రామాలతో పాటు చుట్టు పక్కల తాండలలో కూలీల ద్వారా చెట్లను నరికి వేసి వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు.
దీంతో చూసి చూడనట్టు ఉంటున్న సంబంధిత అధికారుల తీరుకు వాల్టా చట్టం సైతం నీరుగారుతోంది. వేప, తుమ్మ చెట్లను సైతం అక్రమార్కులు వదలడం లేదు. ఇళ్లలో ఉన్న చెట్లు మొదలు, వ్యవసాయ క్షేత్రంలో, గుట్టలలో రోడ్డు వైపు పెరిగిన వృక్షాలను నరుకుతున్నారు. సాయంత్రం టైం ఆరు దాటితే చాలు మండలంలో వివిధ గ్రామాలలో నరికిన కలపను అక్రమార్కులు దర్జాగా వాహనాల ద్వారా ఖమ్మం వైపు రవాణా చేస్తుంటారు. మండలంలో జోరుగా సాగుతున్న అక్రమ కలప రవాణా అధికారుల కనుసైగలోనే జరుగుతుందాని మండల ప్రజలు సైతం చెవులు గొరుకుంటున్నారు. అధికారుల నియంత్రణ కొరవడి విచ్చలవిడిగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధిక ధరలకు కలపను విక్రయాలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అటవిశాఖ అధికారులు స్పందించి అక్రమార్కుల జోరును అడ్డుకుంటారా లేదో వేచి చూద్దాం.