దిశ, కోదాడ: పచ్చని పల్లెలు జిలెటిన్ స్టిక్స్ మోతకు హడలెత్తి పోతున్నాయి. ప్రభుత్వం అధిక మోతాదులో జిలెటిన్ స్టిక్స్ వాడొచ్చని అనుమతులు ఇచ్చిందా లేక నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో వాడుతున్నారా అనేది అర్థం కావడం లేదని కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రహారి గోడలతో పాటు, ఇంటి నిర్మాణ గోడల పగుళ్లు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లబండగూడెం గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో వాటి ధాటికి గోడకు పూర్తిగా పగుళ్ళు వచ్చాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పలుమార్లు గ్రామ ఎంపీటీసీ ఎర్రమల క్రాంతి కుమార్ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. నల్లబండగూడెం నుండి మంగలి తండా వెళ్తున్న క్రమంలో గ్రానైట్ క్వారీ ఉంది.
ఈ గ్రానైట్ క్వారీ వల్ల బాంబులు పెట్టడంతో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చి నల్లబండగూడెం కాలనీవాసులు, మంగళ తండా కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల భారీ శబ్దాలతో నల్లబండగూడెం గ్రామ శివారులో ఉన్న సాయిబాబా గుడి పగుళ్ళు ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.