మానేరు నదిపై అక్రమ వసూళ్లు.. పట్టించుకోని అధికారులు
దిశ ప్రతినిధి, కరీంనగర్: మానేరు నదిపై అక్రమ టోల్ గేట్ ఏర్పాటు చేసి వాహనదారుల..Illegal collections on the Maneru River
దిశ ప్రతినిధి, కరీంనగర్: మానేరు నదిపై అక్రమ టోల్ గేట్ ఏర్పాటు చేసి వాహనదారుల ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్న వైనంపై అధికారులు మౌనం వహించడం వెనక ఆంతర్యం ఏంటో అంతు చిక్కకుండా పోయింది. ఏళ్లుగా సాగుతున్న ఈ తంతుపై అధికారులు చర్యలు తీసుకోకుండా నిలువరిస్తున్న వారెవరోనన్న చర్చ సాగుతోంది.
రెవెన్యూ మాత్రమే..
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడెడు వద్ద ఏర్పాటు చేసిన అక్రమ టోల్ గేట్ గురించి 'దిశ' వెలుగులోకి తీసుకరాగానే తహశీల్దార్ సుధాకర్ ఆదేశాల మేరకు ఆర్ఐ రాజిరెడ్డి రశీదు పుస్తకాలను స్వాధీనం చేసుకుని టోలో గేట్ ను తొలగించారు. మళ్లీ టోల్ గేట్ ను ఓపెన్ చేసిన తరువాత కూడా రెవెన్యూ అధికారులు వారితో మాట్లాడి తీసేయాలని సూచించారు. అయినప్పటికీ టోల్ గేట్ మాత్రం యథావిధిగా నడిపిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. వాస్తవంగా టోల్ గేట్ ఏర్పాటు చేసిన చోట ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో వంతెన నిర్మాణం కూడా జరుగుతోంది. స్లాబ్ పనులు పూర్తయితే రాకపోకలు సాఫీగా జరిగేవని, నిర్మాణంలో ఆలస్యం కావడాన్ని తమకు అనుకూలంగా మల్చుకుని తాత్కాలిక వంతెన వేసి టోల్ వసూళ్లకు పాల్పడుతుండడం గమనార్హం. అయితే ఈ విషయం గురించి ఇరిగేషన్ అధికారులు కానీ ఆర్ అండ్ బీ అధికారులు కానీ కఠినంగా వ్యవహరిస్తే టోల్ గేట్ ను తొలగించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు కొందరు. తమకు సంబంధంలేని విషయమని ఇరిగేషన్ అధికారులు అంటున్నప్పటికీ జలవనరులపై నిర్మాణాలు జరిపినప్పుడు సంబంధిత శాఖ అనుమతి తీసుకోవల్సి ఉంటుందని తెలుస్తోంది. మానేరు నది మీదుగా నీటి ప్రవాహం ఉంటుందని, ఇలాంటి చోట ఎలాంటి నిర్మాణాలు చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ ఆర్ అండ్ బీ అధికారులకు ఆ ప్రాంతాన్ని అప్పగించినట్టయితే రోడ్లు భవనాల శాఖ అధికారులు కూడా ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అయితే సంబంధిత శాఖల అధికారులు మాత్రం ఈ వ్యవహారంపై అంటీముట్టనట్టుగా వ్యవహరించడం గమనార్హం.
అధికారులకు తప్పని తిప్పలు..
పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ విభాగానికి చెందిన అధికారులు మానేరు నది మీదుగా రాకపోకలు సాగిస్తున్న క్రమంలో టోల్ నిర్వాహకులు వారిని అడ్డుకున్నారు. తాము ఫలనా డిపార్ట్ మెంట్ కు చెందిన వారిమని చెప్తే కూడా వినిపించుకోలేదని తెలుస్తోంది. చివరకు వారు తమ ఐడెంటి కార్డులు చూపిస్తే గానీ వారిని వదిలి పెట్టలేదని తెలుస్తోంది. అంతేకాకుండా జర్నలిస్టులు వెళితే కూడా అక్రిడేషన్ కార్డు చూపించాలని అడుగుతుండడం గమనార్హం. అక్రమంగా ఏర్పాటు చేసినప్పటికీ టోల్ నిర్వాహకులు ఓడెడు మీదుగా వెళ్తున్నవారిని మాత్రం సక్రమమైన ఆధారాలు చూపించాలంటుండం గమనార్హం.
ఒత్తిళ్లు ఎవరివో..?
అయితే అక్రమంగా ఏర్పాటు చేసిన టోల్ గేట్ ను తొలగించకుండా అడ్డుకుంటున్నవారెవరూ అన్నదే ఈ ప్రాంతంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వాహనదారుల నుండి అక్రమంగా వసూలు చేస్తున్నవారికి వెన్నుదన్నుగా నిలవడం వల్ల ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగిస్తున్నవారు ఏమీ అనుకున్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం తమ వ్యతిరేకతను చూపించే అవకాశం లేకపోలేదు. సామాన్యులు కావడంతో బలవంతులను ఏమీ అనుకుండా టోల్ రుసుం చెల్లిస్తున్నా భవిష్యత్తులో మాత్రం గుణపాఠం చెప్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఓ వాహనదారుడు వ్యాఖ్యానించడం గమనార్హం.
లాస్ అయ్యారట..
టోల్ నిర్వహకుల వింత వాదన కూడా ఔరా అనిపిస్తోంది. అనుమతి తీసుకోకుండా తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టడమే తప్పంటుంటే ఇప్పటికే అక్కడ రెండు సార్లు వంతెన వేశామని, వరద కారణంగా కొట్టుకపోయిందని చెప్తుండడం విస్మయం కల్గిస్తోంది. రెండుసార్లు వంతెన వేయడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోయాం కాబట్టి ఖచ్చితంగా వసూలు చేసి తీరుతామని స్పష్టం చేస్తుండడం గమనార్హం.