ఆ ఎమ్మెల్యేను నేనొక్కడినే
దిశ, నాగర్‌కర్నూల్: ఆదాయపు పన్ను టాక్సీ డబ్బులను ఆదా చేసుకుంటూ దేశంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా చలామణి
దిశ, నాగర్‌కర్నూల్: ఆదాయపు పన్ను టాక్సీ డబ్బులను ఆదా చేసుకుంటూ దేశంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా చలామణి అవుతున్నారు. మరి వారంతా ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతున్నారా? అని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అడిగారు. ఆదివారం తన జన్మదినం సందర్భంగా జడ్పీ మైదానాల్లో కబడ్డీ క్రికెట్ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. అంతకుముందు పార్టీ నేతలతో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదరికంలో పుట్టడం తప్పుకాదని కానీ అదే పేదరికం భరిస్తూ చనిపోవడమే ఎవరికి వారు చేసుకున్న తప్పుగా భావించాలని అన్నారు. అందుకే పేదలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్లుగా కందనూలు ప్రాంతానికి చేస్తున్నా అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది కోడిగుడ్డు పైన ఈకలు పీకిన విధంగా తనకు ఇన్కమ్‌టాక్స్ మిగులుతుంది కాబట్టి ఇక్కడ ఖర్చు చేస్తున్నారు.
అంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా విమర్శలు చేసేవారు బొడ్రాయికి ఒకరు ఉంటారని మండిపడ్డారు. దేశంలో ఎంతోమంది ప్రముఖులు ప్రజాప్రతినిధులు మంత్రులు ఇన్కమ్‌టాక్స్ జమ చేసుకుంటున్నారని, మరి వారంతా అభివృద్ధి చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా బడ్జెట్ పెట్టుకొని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే నేను ఒక్కడినే దీనికి మీరంతా గర్వపడాలంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో పుట్టిన తాను ఈ గడ్డ రుణం తీర్చుకునేందుకు కందనూలు ప్రాంతానికి కావలి కారుగా పనిచేస్తానని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటిదాకా పది శాతం మాతమే అభివృద్ధి జరిగిందని ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. దీనికి అందరి సహకారం కావాలని కోరారు.