పిల్లల్లో తరచుగా ఎక్కిళ్లు వస్తున్నాయా? చిటికెలో సమస్యకు పరిష్కారం!

దిశ, ఫీచర్స్ : శ్వాస తీసుకునేందుకు సాయపడే ‘డయాఫ్రాగమ్’ కండరం ఆకస్మిక సంకోచాల కారణంగా ఎక్కిళ్లు వస్తాయి..Latest Telugu News

Update: 2022-07-18 08:44 GMT

దిశ, ఫీచర్స్ : శ్వాస తీసుకునేందుకు సాయపడే 'డయాఫ్రాగమ్' కండరం ఆకస్మిక సంకోచాల కారణంగా ఎక్కిళ్లు వస్తాయి. తద్వారా చిన్నపిల్లల్లో అసౌకర్యాన్ని కలిగించే హికప్స్ చిరాకు తెప్పిస్తాయి. తక్కువ వ్యవధిలో వాటంతట అవే తగ్గినా సరే.. ఆ టైమ్‌ వరకు వేచిచూడకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే త్వరిత ఉపశమనం లభిస్తుందని చెప్తున్నారు నిపుణులు.

శిశువు ఎక్కిళ్లకు కారణాలు:

1. తల్లిపాలు

ఫీడింగ్, ఉష్ణోగ్రతల తగ్గుదల శిశువుకు చలిని కలిగించి ఎక్కిళ్లకు దారితీస్తుంది. పేరెంట్స్‌కు ఇది ఆందోళన కలిగించే విషయమే అయినా అనసవరంగా భయపడకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

2. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD)

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిజార్డర్(GERD) ఉన్న శిశువులు తరచుగా ఎక్కిళ్లు అనుభవిస్తారు. రిఫ్లక్స్ కారణంగా శిశువు కడుపు నుంచి ఆమ్లం అన్నవాహికలోకి రావడంతో ఎక్కిళ్లు సంభవిస్తాయి. నవజాత శిశువుల్లో రిఫ్లక్స్ లక్షణాలు దగ్గు, ఉమ్మివేయడం, దురదతో ముడిపడి ఉంటాయి. చిన్నారికి అతిగా ఎక్కిళ్లు వస్తున్నా, ఆ సమయంలో సాధారణం కంటే ఎక్కువగా ఉమ్మివేస్తున్నా డాక్టర్‌ను సంప్రదించాలి. సులభమైన చికిత్సతో పరిస్థితి అదుపులోకి వస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.

3. అతిగా తినడం

అతిగా లేదా త్వరత్వరగా తినడం వల్ల కూడా బేబీకి ఎక్కిళ్లు రావచ్చు. అందువల్ల బిడ్డకు అతిగా తినిపించకుండా జాగ్రత్త వహించాలి. సొంతంగా తినగలిగే వయసులో ఉంటే ఎక్కువగా తినకుండా చూసుకోవాలి.

ఎక్కిళ్లను ఆపే చిట్కాలు :

* బేబీకి నిదానంగా పాలు పట్టడం, బ్రేక్స్ తీసుకుంటూ బర్పింగ్ చేయడం ద్వారా ఎక్కిళ్లను నిరోధించవచ్చు.

* ఓవర్ ఫీడింగ్‌తో కూడా ఈ సమస్య రావచ్చు. అందుకే ఫీడింగ్ సమయంలో బ్రేక్ తీసుకుంటే కడుపు వెంటనే నిండదు. అంతేకాదు బిడ్డకు ఆకలి వేయకముందే తినిపించాలి. ఇందుకోసం తరచూ తక్కువ మొత్తంలో ఆహారాన్ని అందించాలి.

* శిశువుకు వీలైనంత ప్రశాంతమైన, నిశ్శబ్ద వాతావరణంలో ఆహారం తినిపించేలా జాగ్రత్త వహించాలి.

* పిల్లలకు బాటిల్ ఫీడ్ చేస్తున్నట్లయితే.. దాని మొన పూర్తిగా పాలు నిండి ఉండేలా చూసుకోవాలి. ఆ సమయంలో చిన్నారి నోటి ద్వారా గాలి మింగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

* భోజనం తర్వాత బిడ్డ మేల్కొని ఉండేలా చూసుకోవాలి. ఎక్కిళ్లను నిరోధించేందుకు ఫీడింగ్ తర్వాత కాసేపు పిల్లలను అలాగే పట్టుకుని ఉండాలి.  


Similar News