మేషరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
ఈ సంవత్సరము నుండి గురువు13.04.2022 వరకు 11వ స్థానం నందు రజతమూర్తిగా ఉండును.
అశ్విని 1,2,3,4 (చూ,చే,చో,లా) పాదములు భరణి 1,2,3,4 (లీ,లూ,లే,లో)- కృత్తిక 1వ పాదము (అ)
ఆదాయం-14
వ్యయం-14
రాజపూజ్యం-3
అవమానం-6
ఈ సంవత్సరము నుండి గురువు13.04.2022 వరకు 11వ స్థానం నందు రజతమూర్తిగా ఉండును. తదుపరి 12వ స్థానంలో సంవత్సరాంతము వరకు రజతమూర్తిగా ఉండును. శని వత్సరాది నుండి 29.04.2022 వరకు 10వ స్థానంలో తామ్రమూర్తిగా ఉండును తదుపరి 11వ స్థానంలో 12.07.2022 వరకు లోహమూర్తిగా ఉండును. తదుపరి వక్రగతిచే 10వ స్థానంలో రజతమూర్తిగా 17.01.2023 వరకు ఉండును. తదుపరి 11వ స్థానంలో సంవత్సరాంతము వరకు లోహమూర్తిగా ఉండును. రాహు-కేతువులు 2-8 స్థానములలో లోహమూర్తులుగా 12.04.2022 వరకు ఉండును. తదుపరి 1-7 స్థానములందు రజతమూర్తులుగా ఆ సంవత్సరాంతా ఉండును. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుచున్నవి. అయిననూ కొద్దిగా ప్రయాస చేతనైననూ పనులు పూర్తి చేస్తారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలము లభిస్తుంది. మీ వృత్తి-ఉద్యోగములలో మార్పులు ఏర్పడిననూ అది మీ మంచికే జరుగుతుంది. అత్యుత్సాహము పనికిరాదు అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ప్రతీది వాధించే ప్రయత్నం చేయకండి.
'మౌనన కలహం నాస్తి' అను న్యాయాన్ని పాటించండి. విభేదాలకు, వివాదాస్పద వ్యవహారాలకు దూరముగా ఉండుట శ్రేయోదాయకము. ఆర్థిక వ్యవహారాలలో కొద్దిగా ఆలోచించుట మంచిది. అనవసరమైన - వృధా ఖర్చులు అవుచున్నాయని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. చాలా వరకు సత్కార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. ఈ.ఎన్.టి. సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావచ్చును. వైద్యుడిని సంప్రదించుట. ఔషద సేవనము తప్పక పోవచ్చును. సరియైన సమయానికి తగు నిర్ణయాలు తీసుకొని అనేక సమస్యలకు పరిష్కారము పొందుతారు. స్థిరాస్థిగాని చరాస్థిగాని కొనుగోలు చేస్తారు. ప్రతి విషయములో చక్కని సహనం కల్గి ఉన్నా రెచ్చగొట్టు వారుంటారు. తప్పని పరిస్థితులలో ఆవేశం రావచ్చును. అదే అనర్థానికి దారి తీయవచ్చు. విలువైన వస్తువులు -కాగితాలు-దస్తావేజులు జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి. ఏటీఎం మొదలగు కార్డులు జాగ్రత్త పరుచుకోవాలి. సాంకేతికమైన సమస్యలు ఉత్పన్నము కావచ్చును. పుణ్యక్షేత్ర సందర్శన కనపడుచున్నది. అతిగా ఆలోచించి ఏమి ప్రయోజనము లేదని గుర్తిస్తారు. చేయవలసిన పనులు (భవిష్యత్తుకు ఉపయోగపడునవి) ఆలస్యం చేయకుండా పూర్తి చేయండి ఆలస్యం అమృతం విషమం. చాలా కాలంగా అపరిష్కృతముగా ఉన్న సమస్య పరిష్కార దిశగా అడుగు వేస్తుంది. విలాసాలకు కొద్దిగా దూరముగా ఉండటము మంచిది. అపశృతులు జరుగకుండా జాగ్రత్తపడుట మంచిది.
వివాదాస్పదమైన విషయాలలో అతిగా మొండితనానికి పోకుండా కొంత నష్టమైనా భరించి ప్రశాంతత కోరుకుంటారు. సంతానము యొక్క వివాహ విషయంలో నిరాశ పడకండి. సంబంధాలు నిశ్చయము కావటములో ఆలస్యము కావచ్చును. కాని ఈ ఆలస్యమే మీకు శుభాన్ని కలిగించవచ్చును. ఈ సంవత్సరము ఎక్కువగా ఇతరులకు సహాయపడటమే సరిపోతుంది. దాంపత్య సమస్యలు రాకుండా తగు సహనం పాటించండి. చాలా విషయాలలో భాగస్వామ్య ఉద్యోగ విషయాలలో - వ్యాపారాలలో ముల్లును ముల్లుతోనే తీయాలనే మీ తెలివితేటలు సఫలమవుతాయి. భాగస్వామ్య విషయాలు చిలికి-చిలికి గాలివానగా మారకుండా జాగ్రత్త వహించండి. చాలా వరుకు మానసికముగా అసాధ్యము అనుకున్న పనులను సుసాధ్యము చేసి చూపిస్తారు. మీ సంతానము యొక్క అభివృద్ధికి తగినటువంటి మార్గాలను వెదికి వాటిని ఆచరణలో పెడతారు. భవిష్యత్తుకు కావలసిన శాశ్వత ప్రయోజనాలకు తగిన బాటను నిర్ణయించుకుంటారు. రహస్యమును రహస్యముగానే ఉంచాలని నిర్ణయించుకుంటారు. చేయు పని పూర్తి కాకుండానే అత్యుత్సాహముతో డాంభికాలు పలుకకూడదు. విద్యార్థులు కొద్దిగా శ్రమించండి. మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. పేరు ప్రతిష్ట పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనే విపరీత వాంఛకు తాత్కాలికముగా విశ్రాంతినిస్తారు. విదేశాలలో ఉన్నవారికి కొంత ఆలస్యంగా మీకు రావలసిన ప్రయోజనాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించు విద్యార్థులకు ప్రయాసతో పనులు పూర్తి అవుతాయి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న వారు శుభవార్త వింటారు. గర్భణీలు తమ గర్భ రక్షణ కొరకు వైద్య సలహాలతో పాటు ఆధ్యాత్మిక శ్రద్ధ, దేవతా స్తోత్రాలు వినండి-చదవండి. పెద్దల మార్గాన్ని అనుసరించటమే శ్రీరామ రక్ష-ఇక వృధా అనుకున్న జీవితానికి -ఆశ-దిశ-దశ ఏర్పడుతుంది. ఆత్మీయ ఆదరణ లభిస్తుంది. చిట్టీలు-వడ్డీ వ్యాపారాలు చేసేవారు ఈ సంవత్సరము చాలా జాగ్రత్తగా ఉండాలి.
అతి మంచితనము అసమర్థతగా మారవచ్చును. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కాని అయిననూ అసంతృప్తి ఏర్పడవచ్చును. ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి ఉద్యోగ ప్రాప్తి కనపడుచున్నది. విలాసాలకు ధనం ఎక్కువగా ఖర్చు కనపడుచున్నది. ఏక పక్షముగా నిర్ణయాలు తీసుకోకుండా ఓపిక అవసరము అన్నీ తమకే తెలుసుననే భావాన్ని విడిచిపెట్టండి. కోర్టు వ్యవహారాలు మిశ్రమ ఫలాన్ని ఇస్తాయి. మధ్యమార్గముగా పరిష్కరించుకుంటారు. ఆత్మీయతకు-అనురాగానికి కొద్ది రోజులు దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చును. ప్రాచీన విద్యలు-సంగీత సాహిత్యాది వీర్యలయందు ఆసక్తి చూపిస్తారు-ప్రవేశిస్తారు. ప్రావీణ్యత పొందుతారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు (వృత్తి-ఉద్యోగాలలో) తెలివిగా పరిష్కరించుకొని పైవారి మెప్పును పొందుతారు. తోబుట్టువులతో అకారణ కలహాలు-మానసిక విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. గృహంలో శుభకార్యం చేస్తారు. సంతానం తమ మాట వినకపోవటం కొంత ఆందోళన కలిగించవచ్చును. వృత్తి-ఉద్యోగాలలో రాణిస్తారు. మీ అభివృద్ధి కొంత మంది అసూయకు కారణం కావచ్చును. శిరోవేదన ఎక్కువ అవుతుంది. వివాహం విషయంలో తొందరగా నిర్ణయించుకోలేకపోవటం పరిపాటి అవుతుంది. పాతది ఒక రోత కొత్తది ఒక వింతగా భావించే అవకాశము గలదు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ఆశ చిగురిస్తుంది. రాజకీయంగా సామాజికముగా పేరు ప్రతిష్ట సంపాదిస్తారు.