వ్యాపారవేత్తగా మారిన ఎమిరేట్స్ ఫస్ట్ ఫిమేల్ వ్లాగర్..
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ప్రముఖ సోషల్ మీడియా స్టార్స్‌ను అనుసరించే మిలియన్ల మంది యువతుల్లో ఆమె ఒకరు. కానీ ప్రస్తుతం లక్షలాదిమంది ఫాలోవర్స్‌తో తనే ఒక మైక్రో సెలబ్రిటీగా మారింది..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ప్రముఖ సోషల్ మీడియా స్టార్స్‌ను అనుసరించే మిలియన్ల మంది యువతుల్లో ఆమె ఒకరు. కానీ ప్రస్తుతం లక్షలాదిమంది ఫాలోవర్స్‌తో తనే ఒక మైక్రో సెలబ్రిటీగా మారింది. అరబ్ దేశంలో మహిళలపై ఉండే ఆంక్షలు, కట్టుబాట్లు, మూసధోరణులు, సంప్రదాయ పద్ధతులు, సామాజిక విమర్శలను ధిక్కరిస్తూ ఎమిరేట్స్ తొలి మహిళా వ్లాగర్‌గా తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది మోనా సులైమాన్. నిండైన ఆత్మవిశ్వాసంతో, మెండైన ధైర్యంతో ఆమె వేసిన ముందడుగు.. ఆ బాటను అనుసరించాలనుకునే అనేక మంది మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ప్రస్తుతం చాలామంది మహిళలు ఆమె అడుగుజాడల్లో నడుస్తున్నా.. ఈ పంథాలో మొదటివ్యక్తిగా ఆమె ఇప్పటికీ, ఎప్పటికీ తన అభిమానుల నుంచి ప్రత్యేక అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది. 'గ్లోబల్ ఉమెన్ లీడర్‌షిప్'లో బెస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా యూఏఈ ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డ్స్ అందుకున్న మోనా వ్యాపారవేత్తగానూ సత్తా చాటుతోంది. ఈ మల్టీ టాస్కర్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
రాస్ ఆల్ ఖైమాకు చెందిన మోనా సులైమాన్ ప్రభుత్వ సంస్థలోని హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్(హెచ్‌ఎస్‌ఈ) విభాగంలో పనిచేస్తోంది. ఉద్యోగ బాధ్యతలతో పాటు ఇంటి పనులను సమన్వయం చేసుకుంటున్నా ఇంకేదో చేయాలనే సంకల్పంతో 2016లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మద్దతుతో 'vlog Tajarbi(ప్రయోగాలు)' పేరుతో బ్లాగింగ్ ప్రయాణం మొదలుపెట్టింది. తమ ఆచార సంప్రదాయాల ప్రకారం అవివాహిత స్త్రీ ముఖం చూపించేందుకు వీలు లేకపోవడంతో, దాదాపు ఏడాది పాటు ఆమె తన వీడియోల్లో ముఖాన్ని చూపించకుండా కేవలం వాయిస్ ద్వారానే వీడియోలు చేసింది. క్రమంగా మోనాకు ఫాలోవర్స్ సంఖ్యతో పాటు ప్రజాదరణ పెరగడంతో తన ముఖం చూపించేందుకు కుటుంబాన్ని ఒప్పించగలిగింది. కానీ సమాజం నుంచి ఆమోదం పొందడం సవాల్‌గా మారుతుందని భావించింది. ఈ మేరకు గ్లాస్ సీలింగ్‌ను బ్రేక్ చేసేందుకు ఆమెకు చాలా కష్టమైంది కానీ వ్లాగింగ్ ఓ సాధారణ విషయమేనని ప్రజలు అర్థం చేసుకునేందుకు సమయం పడుతుందని ఆశించింది. మోనా అనుకున్నట్లుగానే.. తన అడుగుజాడలను అనుసరించడంలో అనేకమంది ఇతర మహిళలకు ధైర్యాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మోనా సులైమాన్‌ను 'మోనా తాజర్బీ'గా పిలుస్తున్నారు.
బిజినెస్ రంగంలోకి :
బ్యూటీ వ్లాగర్ అయినందున అందరిలా తాజర్బీ కూడా మేకప్ బ్రాండ్ ప్రారంభించాలని కోరుకుంది. ఈ మేరకు 'బ్లింక్' పేరుతో 'ఐ ల్యాషెస్' తయారు చేయాలని నిర్ణయించుకుంది. మహమ్మారి సమయం(2020)లోనే ఒక ఆలోచనగా బ్లింక్ ప్రస్థానం మొదలవగా.. 2021 మార్చిలో అధికారికంగా ప్రారంభించింది. 2022లో ఐబ్రో పెన్సిల్, హాఫ్ లాష్, ఫేస్ మాస్క్, ఐ మాస్క్, లిప్ మాస్క్, ఐలైనర్, సీరమ్ వంటి ఉత్పత్తులకు తన బ్రాండ్‌ను విస్తరించింది. ఇన్‌ఫ్లుయెన్సర్, బిజినెస్‌ఉమెన్, HSE పరిపాలన అధికారి సహా మిడిల్ ఈస్ట్ స్మార్ట్ సెల్స్ కోసం ఆమె అవేర్‌నెస్ అంబాసిడర్‌గా కూడా పనిచేస్తోంది. ఈస్ట్ స్మార్ట్ సెల్స్‌లో భాగమైనందుకు మోనా సంతోషపడగా, భవిష్యత్తులో పిల్లల జీవితాన్ని కాపాడేందుకు మూలకణాలు చాలా ముఖ్యమైనవని ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అంతేకాదు మోనా షేక్ సౌద్ బిన్ సకర్ ఫౌండేషన్‌కు హోప్ అంబాసిడర్‌గానూ చేస్తోంది. ఇన్ని పనులతో పాటు ఇద్దరు పిల్లలను, ఇంటి బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఈతరం మహిళామణులకు ఆదర్శంగా నిలుస్తోంది.
మహిళను అంగీకరించడం కష్టమే కానీ..
ఇత్తిహాద్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్ అండ్ ట్రాన్స్‌లేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, డీన్ కార్యదర్శిగా అదే యూనివర్సిటీలో పని చేయడం ప్రారంభించాను. అదే సమయంలో మిచిగాన్‌లోని మడోన్నా విశ్వవిద్యాలయం నుంచి MBA చేశాను. 12 ఏళ్లుగా పలు విభాగాలకు రాస్ ఆల్ ఖైమా(RAK) ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను. ప్రస్తుతం HSE పరిపాలన అధికారిగా చేస్తూనే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా రాణిస్తున్నాను. నిజానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఒక మహిళను అంగీకరించడం కష్టమే కానీ నా విషయంలో నేను నా ఆచారాలు, సంప్రదాయాలను కించపరచకుండా ఉండేందుకు ప్రయత్నించాను. నా సిన్సియర్ ఎఫర్ట్ ప్రజలను ఆకర్షించింది. ఇక RAK నుంచి మొదటి మహిళా బ్లాగర్ కావడంతో ఇక్కడి ప్రజలు నా అనుభవాలను చూసేందుకు ఇష్టపడతారు. స్థానిక రెస్టారెంట్స్ సమీక్షలు, మేకప్ ట్యుటోరియల్స్ సహా ఇతర విషయాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ విషయంలో సదరు బ్రాండ్‌ను పూర్తిగా విశ్వసిస్తే తప్ప ఎప్పటికీ ప్రచారం చేయను. ఇక మహిళా వ్యాపారవేత్త కావడం అద్భుతమైన అనుభవం. నా మొత్తం ప్రయాణంలో నా కుటుంబం సహా నా భర్త చాలా సపోర్టివ్‌గా ఉన్నారు.
- మోనా సులైమాన్