దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ వినియోగదారులకు రుణ సౌకర్యం సులభంగా అందించేందుకు ఐడీఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుతో భాగస్వామ్యం చేసుకున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా హీరో ఎలక్ట్రిక్ కస్టమర్లు తక్కువ ప్రాసెసింగ్ ఫీజు, తక్కువ డౌన్ పేమెంట్, తక్కువ సమయంలో తక్షణ రుణాన్ని పొందడానికి వీలవుతుందని కంపెనీ వెల్లడించింది. 'ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుతో జత కట్టడం సంతోషంగా ఉంది. దీనివల్ల తమ ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ఎక్కువమందికి చేరువ చేసేందుకు వీలవుతుందని' హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, వినియోగదారులకు సౌకర్యవంతమైన రుణ పరిష్కారాలు, పేపర్‌లెస్ ప్రక్రియ, మెరుగైన ప్రయోజనాలను అందించే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు నుంచి హీరో ఎలక్ట్రిక్ వినియోగదారులు సులభతరమైన రుణాలను పొందగలరని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వాహన రుణ విభాగం ప్రతినిధి రిషి మిశ్రా వెల్లడించారు.