దిశ, ఫీచర్స్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఉక్రెనియన్స్ సహా ఇతర దేశీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో పనిచేస్తున్న పిట్స్‌బర్గ్‌కు చెందిన 25 ఏళ్ల ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మానీ మరోట్టా.. తన స్వదేశానికి కాలినడకన బయలుదేరాడు. ఈ మేరకు ఎల్వివ్ నుంచి పోలాండ్ వరకు 20 గంటల ప్రయాణ వివరాలను, దారుల వెంబడి గోచరించిన పరిస్థితులను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
ఉక్రెయిన్ నుంచి ప్రాణాలతో బయటపడే ప్రయత్నంలో ప్రజలు పడుతున్న కష్టాలను 'ఉక్రెయిన్ కాన్‌ఫ్లిక్ట్ లైవ్ 2022' పేరుతో తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వివరించాడు. ఏటీఎమ్‌లో డబ్బులు లేక, గ్యాస్ స్టేషన్‌లో ఫ్యూయెల్ లేక ప్రజలు నానా అవస్థలు పడుతుండగా.. 25 కిలోమీటర్ల మేర వందలాది కార్లు బారులు తీరాయని వెల్లడించాడు. చాలామంది ప్రజలు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో.. పెట్రోల్ అయిపోయిన తమ వాహనాలను రోడ్డు మీద విడిచివెళ్లారని, ఇక దేశాన్ని రక్షించుకునేందుకు 18 - 60 ఏళ్ల పురుషులు సైన్యంలో చేరాలని ఉక్రెయిన్ ఆర్మీ పిలుపునిచ్చినట్లు వివరించాడు. ఈ మేరకు 'మీ కుమార్తెలు, తల్లులు, స్నేహితురాళ్ళకు వీడ్కోలు చెప్పండి, మీరు వెనక్కి తిరిగి రష్యన్ ఆక్రమణదారులతో పోరాడాలి' అంటూ ఓ కమిషనర్ పురుషులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ప్రస్తావించాడు.
ఈ క్రమంలోనే ఆక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యం బలవంతంగా ఒక మహిళ భర్తను లాక్కెళ్లిందని వెల్లడించిన జర్నలిస్ట్.. ఆమె తన భర్తను విడిచిపెట్టమని ప్రాధేయపడ్డా వినలేదని తెలిపాడు. పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉందని.. పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చాడు.