బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌పై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

దిశ, లక్షెట్టిపేట: కేంద్రం ధాన్యం కొనకపోతే తెలంగాణ ఉద్యమాన్ని తలపించే తరహాలో మరో ఉద్యమం.. Latest Telugu News..

Update: 2022-03-24 08:40 GMT

దిశ, లక్షెట్టిపేట: కేంద్రం ధాన్యం కొనకపోతే తెలంగాణ ఉద్యమాన్ని తలపించే తరహాలో మరో ఉద్యమం తప్పదని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. గురువారం లక్సెట్టిపేటలోని ఎస్.ఆర్.ఆర్ గార్డెన్‌లో జరిగిన టీఆర్ఎస్ మంచిర్యాల నియోజకవర్గం విస్తృత స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ రైతులను రబీలో ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తే, బీజేపీ నాయకులు రెచ్చగొట్టి వరి పంట వేసేలా చేశారని, తీరా పంట చేతికొచ్చాక కొనే నాథుడు లేడని విమర్శించారు.

ఏప్రిల్‌లో పంట చేతికి వస్తున్నందున కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే ఊరూర బీజేపీ నాయకులను, ఆ పార్టీ ఎంపీలను నిలదీయాలని చెప్పారు. ఈ నెల 25 నుంచి 31 వరకు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, సహకార సంఘాలు, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో తీర్మానాలు చేసి పీఎం ఆఫీస్‌కు పోస్ట్ చేయాలని కోరారు. ఎట్టి కైనా.. మట్టి కైనా తెలంగాణ కోసం పోరాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీనే అని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపించారు.

గుండు, అర గుండు లాంటి నాయకులు కేంద్రం మోచేతులు నాకుతూ తెలంగాణ రైతాంగాన్ని మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ.. వరి వేయండని, కొంటామని చెప్పి మభ్య పెట్టిన బీజేపీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక 63వ నెంబర్ జాతీయ రహదారిపై కేంద్రం పెంచిన పెట్రో, గ్యాస్ ధరలను నిరసిస్తూ రాస్తారోకో చేశారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మున్సిపల్ చైర్మన్లు కాంతయ్య, రాజయ్య, నాయకులు ప్రభాకర్, గురువయ్య, సరోజ, సురేందర్ రెడ్డి, గురువయ్య, భూమేష్, శ్రీనివాస్, స్వర్ణలత, చిన్నయ్య, తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News