భక్తుల నుంచి ఒక్క ఫిర్యాదు రాకుండా ఏర్పాట్లు జరగాలి : ఆది శ్రీనివాస్

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి

Update: 2025-01-08 06:35 GMT

దిశ,వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఏడాది జరిగే శివరాత్రి జాతరను మన ఇంటి పండగల నిర్వహించుకుందామని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 25 నుంచి మూడు రోజులపాటు జరిగే మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని బుధవారం ఆలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన జాతర సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది 2.5లక్షల మంది భక్తులు వచ్చారని, ఈ ఏడాది ఈ సంఖ్య 4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ఒక్క ఫిర్యాదు అనేది రాకుండా భక్తులు దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు జరగాలని, భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు వేయాలని సూచించారు. క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, మజ్జిగ, పండ్లు, పాలను అందించేలా చూడాలని, ఈసారి దేవాదాయ శాఖ తరపున కూడా క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుద్ధ్యం సక్సెస్ అయితేనే జాతర సక్సెస్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల విషయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి శుభ్రం చేసేలా ఏర్పాట్లు ఉండాలని, ఎవరు వెళ్లి చూసిన మరుగుదొడ్లు శుభ్రం గా ఉండాలని, లేదంటే సంబంధిత జోనల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు ఉండాలని, ప్రోటోకాల్, వీఐపీ దర్శనాల ఏర్పాట్లలో ఎలాంటి లోటు పాటు ఉండరాదని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి అవసరమైతే అదనపు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని, మొబైల్ ఫోన్లో నెట్వర్క్ సమస్యలు ఉండనున్న నేపథ్యంలో ఆయా కంపెనీల ఆధ్వర్యంలో అదనపు టవర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ధర్మగుండంలో భక్తులు స్నానాలు చేసే విషయంలో ప్రముఖుల అభిప్రాయాలను తెలపాలని కోరారు. దాతలకు సంబంధించిన వివరాలను ముందే స్వీకరించి ఎవరెవరు ఎలాంటి పదార్థాలను ఇస్తారోననే విషయంలో ఆలయ అధికారులు ముందస్తూ సమాచారం సేకరించాలని సూచించారు.

మూడు రోజుల పాటు జరిగే జాతర ఏర్పాట్లన్నీ పక్కగా ఉండాలని, తుతూమంత్రంగా ఏర్పాట్లు చేస్తామంటే ఉపేక్షించేది లేదని అందరూ సూచనలు సలహాలు అందించి, జాతర విజయవంతం అయ్యేందుకు సహకరించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతమయ్యేందుకు కృషి చేయాలని, విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జాతరలో దాతలపై ఆధారపడకుండా ఆలయ అధికారులు భక్తులకు పండ్లు, పాలు, ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్,ఆర్డీవో రాజేశ్వర్, ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఆలయ ఈవో వినోద్, మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, మున్సిపల్ చైర్మన్ మాధవి, మున్సిపల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బింగి మహేష్, కనికరపు రాకేష్ లతో పాటు అన్ని శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News