సర్కారు వారి రియల్ బిజినెస్.. అన్యాయమంటున్న రైతులు
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ గృహకల్పలో ఉన్న ఓపెన్ ప్లాట్లను.. Latest Telugu News..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ గృహకల్పలో ఉన్న ఓపెన్ ప్లాట్లను.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా ప్రభుత్వం మంచి లాభాలను గడించింది.. అనుకున్న దాని కన్నా అదనంగా 35 - 50 శాతం వరకు ఆదాయం లభించింది.. ఇదే విధానాన్ని కొనసాగించి ప్రభుత్వ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఎత్తుగడలు వేస్తోందని క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి.. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, మండలాలు, గ్రామాలు అన్న తేడాలు లేకుండా ప్రతిచోటా వృధాగా ఉన్న భూములతో పాటు, గతంలో ప్రజలు సాగు చేసుకోవడానికి వీలుగా పంపిణీ చేసిన భూములను సైతం స్వాధీనపరచుకోవాలని ప్రభుత్వం ఆయా జిల్లాల అధికార యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అధికార యంత్రాంగం గత నాలుగైదు రోజుల నుండి ఆయా మండలాల్లో రైతులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములతో పాటు, బీడు భూములను గుర్తించే పనిలో పడ్డారు. ప్రత్యేకించి భూములకు అత్యంత విలువలు ఉన్న బాలనగర్, రాజాపూర్, జడ్చర్ల, భూత్పూర్, అడ్డాకుల మండలాల్లో 300 ఎకరాలను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో ఆయా జిల్లాల అధికారులు ఉన్నారు.
భూముల ధరలు పెరగడంతో:
రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో జాతీయ రహదారి పక్కన ఉన్న భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. మహబూబ్ నగర్ జిల్లాలోని బాలనగర్, జడ్చర్ల, రాజాపూర్, భూత్పూర్, అడ్డాకుల మండలాలలో ఒక్కసారిగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గతంలో రైతులకు ఇచ్చిన భూములన్నింటిని గుర్తించి వాటిని స్వాధీనపరచుకొని వెంచర్లుగా మార్చడానికి సన్నద్ధమవుతోంది. అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూములను ప్రభుత్వం ఏ సమయంలోనైనా స్వాధీనపరచుకోడానికి అవకాశం ఉంటుందన్న నిబంధనలతో రైతులకు ఇచ్చిన భూములు అన్నింటిని స్వాధీనపరచు కోడానికి సిద్ధమవుతోంది.
రైతులకు ఇలా చెబుతున్నారు :
నిజాం ప్రభుత్వం, తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు భూములను పేదలకు ఇచ్చాయి. గత పది సంవత్సరాల క్రితం వరకు కూడా కొన్ని భూములను పేదలకు ఇచ్చాయి. వాగులు, వంకలు, గుట్టలతో కూడి ఉన్న ఆ పొలాలను చాలా మంది రైతులు కష్టపడి చదును చేసుకుని పంటలు పండించుకుంటున్నారు. మరికొందరు మామిడి, తదితర తోటలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. వారికి ప్రభుత్వ పరంగా రైతు బంధు పథకం కూడా అందుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ భూములన్నింటినీ గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారులు రైతులను పిలిపించుకొని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మీరు ఇంత కాలం సాగు చేసుకున్నారు.
మీరు ఇచ్చే ప్రతి ఎకరాలో 400 -500 గజాల ప్లాట్ల స్థలం ఇస్తాము. మీ పొలాన్ని డెవలప్ చేయడం వల్ల మీకు లాభం ఉంటుంది. మీరు ఇవ్వకపోయినా ప్రభుత్వం లాగేసుకుంటుంది. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మరింత నష్టపోతారు. మీ ఇష్టం మేము చెప్పినట్లు విని భూములు ఇస్తే సరి.. లేదంటే మీరే నష్టపోతారని రైతులు భయపడే విధంగా మాట్లాడుతున్నారు. మీరు అందరూ సరే అంటే జిల్లా కలెక్టర్ సార్ వద్దకు వెళ్లి మాట్లాడదామని ఆయా మండలాల స్థానిక తహసిల్దార్‌లు రైతులను ఒప్పించే పనిలో పడ్డారు. కాగా మాకు ప్లాట్లు వద్దు.. మా భూములు మాకే ఉండాలి.. తరతరాలుగా మేము ఆ భూములను నమ్ముకొని బతుకుతున్నాం.. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తమ భూములను లాక్కుంటే తామేం కావాలని రైతులు అధికారుల ముందు వాపోతున్నారు.
ప్రభుత్వం తప్పనిసరిగా తమ భూములను తీసుకోవాల్సి వస్తే అన్ని రకాల అభివృద్ధి చేసి 50 శాతం తీసుకొని 50 శాతం తమకు కేటాయించాలని మరికొంత మంది రైతులు కోరుతున్నారు. కాగా భూముల సేకరణకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు, నియమ నిబంధనలు జారీ చేయకపోవడంతో మౌఖిక ఆదేశాల ప్రకారం తమ పనులు తాము చేసుకుంటూ వెళుతున్నారు. ఒక ఉమ్మడి పాలమూరు జిల్లా లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భూముల సేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.