చిల్లింగ్ జుగాడ్: హాట్ హాట్ సమ్మర్‌లో చల్ల చల్లని రిక్షా..!
నగరమంతా సెంట్రల్ ఏసీ ఉంటే ఎంత బాగుటుంది అనుకుంటారు చాలా మంది. Garden Ricksha Jugaad got good response.
దిశ, వెబ్‌డెస్క్ః టాలెంట్, క్రియేటివిటీ ఎవరి సొంతం కాదు. ఆయా పరిస్థితులను బట్టి సమయానుసారంగా బయటకొస్తాయంతే! ఉన్న పరిమిత వనరులను వినూత్న రీతిలో ఉపయోగించి సమస్య పరిష్కారానికి అనువైన విధానం కనుక్కోవడంతోనే మనిషి అభివృద్ధికి మొదటి అడుగు పడింది. ప్రస్తుతం వివిధ కాలుష్యాల వల్ల, పర్యావరణం పాడైపోతూ, మనుషుల్లోనూ సామర్థ్యం సన్నగిల్లుతున్నా, సృజనాత్మకతకు మాత్రం కొదువ లేదు. కేరళలోని కుట్టనాడ్ నుండి సియాచిన్ హిమానీనదంపై ఇందిరా కల్ వరకు ఇండియాలో కష్టజీవులు ఎంతో క్రియేటీవ్‌గా ఆలోచిస్తారనడానికి ఒక ఉదాహరణే ఈ చిల్లింగ్ జుగాడ్. ఓ వైపు ఉష్ణోగ్రతలు పైపైకి ఎగబాకుతుంటే, ఎండి వేడికి తట్టుకోలేక నగరమంతా సెంట్రల్ ఏసీ ఉంటే ఎంత బాగుటుంది అనుకుంటారు చాలా మంది. అయితే, అది ఎలాగూ సాధ్యం కాదు గనుక ఆర్టీసీ బస్సులు, ఆటోరిక్షాలు కొబ్బరి పరదాలు కప్పుకుంటూ ప్రయాణికులకు చల్లదనం అందించడం ఈమధ్య చూస్తూనే ఉన్నాం. కానీ, ఓ రిక్షా పుల్లర్ మాత్రం క్రియేటివిటీకి కారణాన్ని జోడించి, అటు పర్యావరణానికి ఇటు ప్రజలకి మేలుచేసే సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. తన రిక్షానే ఓ మినీ గార్డెన్‌లా చేసి అందర్నీ ఆకర్షిస్తున్నాడు. రిక్షాపైన గడ్డిని, చుట్టూతా చిన్నచిన్న కుండీల్లో పచ్చపచ్చని మొక్కల్ని పెట్టి పార్క్‌లో కూర్చొని ప్రయాణం చేస్తున్న ఫీలింగ్‌ని తెచ్చాడు. ఈ సరికొత్త మేక్ఓవర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హీమ్ దృష్టిని ఆకర్షించింది. అతను ఆ చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకోగా, మనోడి ఐడియాకు నెట్టింట్లో అందరూ ఫిదా అయ్యారు.