విద్యార్థులు నిల్.. హాజరు ఫుల్.. రెండేళ్లుగా దొంగ హాజరు బాగోతం
దిశ, బాన్సువాడ: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుంది కోటగిరి భవిత ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. శారీరక, మానసిక వికలాంగులకు.. Latest Telugu News..
దిశ, బాన్సువాడ: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుంది కోటగిరి భవిత ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. శారీరక, మానసిక వికలాంగులకు విద్య అందించాలని ఇక్కడ ప్రత్యేక పాఠశాల ప్రారంభించారు. లక్ష్యం ఉన్నతమైనప్పటికీ ఆచరణ నీరుగారుతోంది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో నిధులు వృధా అవుతున్నాయి. గత రెండేళ్లుగా ఒక్క విద్యార్థి ఈ పాఠశాలకు రావడం లేదు. కానీ విద్యార్థులు వచ్చినట్టు ఉపాధ్యాయులు హాజరు వేస్తున్నారు. వారి జీతాల కోసం హాజరుకాని విద్యార్థులను హాజరైనట్టు చూపించడం విమర్శలకు దారి తీస్తోంది. స్థానిక విద్యార్థి సంఘాలు, విద్యావంతులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు, ఓ ఆయమ్మ ఉండగా, గత రెండు నెలల నుంచి ఓ ఉపాధ్యాయురాలు ప్రస్తుతి సెలవుపై రావడం లేదని, మరో ఉపాధ్యాయుడు వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతున్నాడని వాపోతున్నారు.
పిల్లలు లేని బడికి, రెండేళ్లుగా జీతం తీసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడుతున్నారు. లేని హాజరు చూపించడం వల్ల ప్రభుత్వ నిధులు వృధా అవుతున్నాయని వాపోతున్నారు. సుమారు నెలకు రూ. 50వేల నిధులు పక్కదారి పడుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ, వికలాంగుల శాఖల అధికారులు స్పందించి ఇక్కడ జరుగుతున్న దొంగ హాజరు నమోదుపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నకిలీ హాజరు చూపిస్తూ, జీతాలు తీసుకుంటున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చట్ట ప్రకారం నిధుల రికవరీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా మింగిన డబ్బులు కక్కించాలని అధికారులను కోరుతున్నారు. మరి విద్యా, వికలాంగుల శాఖల అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.