తగ్గిన ఇంధన డిమాండ్!

న్యూఢిల్లీ: పలు రంగాల్లో వినియోగం తగ్గడం, ప్రయణాలు తగ్గడం వంటి పరిణామాలతో ఈ ఏడాది జూలై మొదటి అర్ధ భాగంలో ఇంధన డిమాండ్ పడిపోయిందని

Update: 2022-07-17 12:16 GMT

న్యూఢిల్లీ: పలు రంగాల్లో వినియోగం తగ్గడం, ప్రయణాలు తగ్గడం వంటి పరిణామాలతో ఈ ఏడాది జూలై మొదటి అర్ధ భాగంలో ఇంధన డిమాండ్ పడిపోయిందని తాజా గణాంకాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ డేటా ప్రకారం, దేశంలో అత్యధికంగా వినియోగించే డీజిల్ వినియోగం జూలై 1-15 మధ్య కాలంలో 13.7 శాతం తగ్గి 36.7 లక్షల టన్నుల నుచి 31.6 లక్షల టన్నులకు పడిపోయింది. దేశవ్యాప్తంగా రుతుపవనాల సమయం, ఇంధన కొరత వల్ల డీజిల్ డిమాండ్‌పై అధిక ఒత్తిడి ఉంది. దీనికితోడు సాధారణంగానే జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. వరదల కారణంగా డీజిల్‌ను ఎక్కువగా వినియోగించే వ్యవసాయ రంగం నుంచి డిమాండ్ తక్కువగా ఉంటుంది. అయితే, డీజిల్ డిమాండ్ గతేడాది కంటే దాదాపు 27 శాతం ఎక్కువగా ఉంది.

అంతకుముందు 2020 నాటితో పోలిస్తే 43.6 శాతం, 2019 స్థాయి కంటే 13.7 శాతం ఎక్కువ అని గణాంకాలు వెల్లడించాయి. సమీక్షించిన కాలంలో పెట్రోల్ అమ్మకాలు 7.8 శాతం తగ్గి 12.7 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఇది గతేడాదితో పోలిస్తే 23.3 శాతం ఎక్కువ, 2020 కంటే 46 శాతం ఎక్కువ, 2019 కంటే 27.9 శాతం ఎక్కువ. విమానయాన రంగం అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న తర్వాత దేశీయంగా తిరిగి పుంజుకుంటోంది. ఇటీవలే ప్రయణీకుల రద్దీ కరోనా ముందు స్థాయికి చేరువైంది. దీంతో జూలై అర్ధభాగంలో విమాన ఇంధనం(ఏటీఎఫ్) డిమాండ్ 77.2 శాతం పెరిగి 2.47 లక్షల టన్నులకు చేరుకుంది. ఇది 2020 నాటి కంటే 125.9 శాతం ఎక్కువ, కానీ 2019 నాటి కంటే 17.7 శాతం తక్కువగానే ఉంది. అమ్మకాలు కూడా 6.7 శాతం పడిపోయాయి. గ్యాస్ ఎల్‌పీజీ అమ్మకాలు గతేడాది కంటే 14.15 శాతం పెరిగి 12.4 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఇది 2020 కంటే 16.6 శాతం ఎక్కువ, 2019, జూలై కంటే 8.6 శాతం ఎక్కువ డిమాండ్ ఉంది.

Tags:    

Similar News