ఎలక్ట్రిక్ బైక్స్ సురక్షితమేనా..? వరుస ఘటనలపై కేంద్రం సీరియస్..
దిశ, డైనమిక్ బ్యూరో: పెరుగుతున్న పెట్రో ధరలు, కాలుష్యం కారణంగా ప్రజలు ఇప్పుడిప్పుడే- latest Telugu news
దిశ, డైనమిక్ బ్యూరో: పెరుగుతున్న పెట్రో ధరలు, కాలుష్యం కారణంగా ప్రజలు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. అయితే, ఇలాంటి తరుణంలో ఎలక్ట్రిక్ బైక్స్ వాటంతటవే కాలిపోవడం చర్చనీయంశమవుతోంది. ఇండియాలో వేసవి ప్రారంభంలోనే ఇలాంటి ఘటనలు జరగడంతో ఈ-వాహనాల కొనుగోలు చేయడం సురక్షితమేనా అనే చర్చకు దారితీసింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు వేసవిలో ఎంత వరకూ సురక్షితం అన్న అంశం వాహనదారులను వెంటాడుతోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు ఏర్పడేందుకు ముఖ్య కారణం లిథియం-అయాన్ బ్యాటరీలలో జరిగే థర్మల్ రన్ వల్లేనని నిపుణులు అభిప్రాయడుతున్నారు. వీటిని నిర్మూలించాలంటే ఈ-వాహన తయారీ కంపెనీలు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలతో పాటు వినియోగించే బ్యాటరీలు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది.
ఎలక్ట్రిక్ మొబిలిటీని సురక్షితంగా మార్చే ప్రయత్నంలో భాగంగా వేసవిలో మరింత సురక్షితంగా మార్చేందుకు కంపెనీలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అంతేగాకుండా, రెండు రోజుల క్రితం ఓలా ఈ బైక్‌లో ఏర్పడ్డ మంటలను సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపి నివారణ చర్యలను సూచించాల్సిందిగా సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES)ను ఆదేశించింది. అయితే, సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై కొందరు నిపుణులు స్పందిస్తూ.. భారత్‌లో వేసవిలో నమోదయ్యే భారీ ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని బ్యాటరీని వేడిమి నుంచి భద్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సింది అని అభిప్రాయపడుతున్నారు.
ఈవీలలో థర్మల్ మేనేజ్ మెంట్ సరిగా లేకపోవడంతో ఇలాంటి సమస్య వస్తోందని, వీటిలో వినియోగించిన బ్యాటరీలు ఓవర్ హీట్ అవ్వడం వల్ల కాలిపోతున్నట్లు గుర్తించారు. ఇవి ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయని మరికొన్ని రోజుల్లో బెటర్ థర్మల్ మేనేజ్మెంట్ కలిగిన ఈవీలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.