దిశ ఎఫెక్ట్…స్పందించిన హైడ్రా అధికారులు
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణకు గురైన ఓపెన్ స్థలాలు అంటూ 'దిశ' దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు హైడ్రా అధికారులు స్పందించారు.
దిశ, బడంగ్ పేట్ : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణకు గురైన ఓపెన్ స్థలాలు అంటూ 'దిశ' దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు హైడ్రా అధికారులు స్పందించారు. ఈ నెల 9వ తేదీన పేదలకు శిక్ష పెద్దలపై ప్రేక్షక పాత్ర ... బడంగ్ పేట్లో టౌన్ ప్లానింగ్ అధికారుల పై ఆరోపణలు ...ఇందిరమ్మ ఇంటి స్థలంలో నిర్మించిన షెడ్డు కూల్చివేత... పట్టా భూమిలోనే నిర్మిస్తున్నా లెక్కచేయని టౌన్ ప్లానింగ్ సిబ్బంది... 30వ డివిజన్ లో 153గజాలు మాయం అంటూ 'దిశ' దిన పత్రికలో కథనం ప్రచురితమయ్యింది. అలాగే ఈ నెల 17వ తేదీన మున్సిపల్ స్థలంలో అపార్ట్ మెంట్లు .... రెండు భారీ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులు... 2200 గజాల ఓపెన్ ల్యాండ్‌లో నిర్మాణం... 2018లో సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు... ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికార యంత్రాంగం అంటూ 'దిశ' దినపత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.
దీంతో బీజేపీ బడంగ్ పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డిలు 'దిశ' పత్రికలో వచ్చిన కథనాల ప్రతిని కూడా జత పరుస్తూ హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్ ఆధ్వర్యంలో సోమవారం బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్‌గూల్ విలేజ్ మున్సిపల్ కాలనీలోని సర్వేనెంబర్ 743, 747, 748, 749, 750 లలో కబ్జాకు గురైన 5100 గజాల ఓపెన్ స్థలం తో పాటు , మారుతీనగర్‌లోని సర్వే నెంబర్ 79,80లలోని 2188 గజాలలో ఆక్రమణకు గురైన ఓపెన్ స్థలాన్ని గాయత్రీ హిల్స్‌లోని సర్వే నెంబర్ 787, 788, 789, 790లలో కబ్జాకు గురైన పార్కు ప్రదేశాన్ని, సర్వేనెంబర్ 119లో అక్రమ కట్టడాల ప్రాంతాన్ని, అయోధ్య నగర్‌లోని సర్వేనెంబర్ 75 /1 లోని ఆక్రమణకు గురైన పార్క్ స్థలం, సర్వే నెంబర్ 58,59,60లలోని ఇరిగేషన్ నాలాను అక్రమించి నిర్మించిన ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు ఎప్పటి నుంచి కబ్జాకు గురయ్యాయి? ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయి? కబ్జాకు పాల్పడిందెవరు? అని హైడ్రా అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. త్వరలోనే పూర్తి స్థాయి విచారణ చేపట్టిన అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు నివేదికను అందజేస్తామని, ఆపై అక్రమార్కులపై చర్యలు చేపడతామని హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్ హెచ్చరించారు.