దిశ ఎఫెక్ట్ : వెంటనే స్పందించిన ఎంపీడీవో, ఎంఈఓ
మండలంలోని పెద్దూరు తండా ప్రాథమిక పాఠశాల గ్రౌండ్ లో చెట్ల కుప్పలతో అపరిశుభ్రంగా ఉందని,
దిశ, తలకొండపల్లి : మండలంలోని పెద్దూరు తండా ప్రాథమిక పాఠశాల గ్రౌండ్ లో చెట్ల కుప్పలతో అపరిశుభ్రంగా ఉందని, పాములు తేళ్లు ఆ చెట్ల కుప్పల్లోకి చేరే ప్రమాదం ఉందని దిశ దినపత్రికలో ఆదివారం మధ్యాహ్నం వెబ్లింగ్ ద్వారా కథనం వెలువడింది. సోమవారం ఉదయం పాఠశాల తెరుచుకునే లోపే తలకొండపల్లి ఎంపీడీవో ఆదేశాల మేరకు స్థానిక పంచాయతీ కార్యదర్శి లింగస్వామి, ఎంఈఓ చంప్ల నాయక్ పాఠశాల ఆవరణకు చేరుకొని వృధాగా పడి ఉన్న చెత్త కుప్పలను స్థానిక పంచాయతీ కార్మికులచే తొలగించారు. అదేవిధంగా పాఠశాలలోని వాటర్ సంపును అసంపూర్తిగా వదిలేశారని ప్రచురించింది.
పాఠశాల ఆవరణలో అసంపూర్తిగా ఉన్న వాటర్ సంపు పనులు మన ఊరు- మన బడి కార్యక్రమంలో కాంట్రాక్టర్ ద్వారా వర్క్ చేశారని, అతను గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించడంతో పనులు ఆగిపోయాయని, త్వరలో మిగిలిపోయిన ఆ పనులను కూడా మరో రెండు మూడు రోజుల్లో పూర్తి చేయిస్తానని ఎంఈఓ దిశ ప్రతినిధికి సూచించారు. పనులు జరగకపోతే ఆ సంపు పై పిల్లలకు ప్రమాదం జరగకుండా ఇనుప కంచను ఏర్పాటు చేయిస్తానని పేర్కొన్నారు. దిశ కథనంతో అధికారులు స్పందించినందుకు స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తండావాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.