దిశ, వెబ్‌డెస్క్: విమానయాన సంస్థ ఎయిర్ఇండియాకు కొత్త సీఈఓ, ఎండీగా ఇల్కర్ ఐచీని నియమిస్తున్నట్టు సోమవారం టాటా సన్స్ ప్రకటించింది. ఇల్కర్ ఐచీ గతంలో టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు ఛైర్మన్‌గా, బోర్డు సభ్యుడిగా పనిచేశారు. సోమవారం జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో ఆయన నియామకాన్ని ఖరారు చేయగా, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎయిర్ఇండియా చీఫ్‌గా ఇల్కర్ ఐచీ బాధ్యతలను తీసుకుంటారని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నియామకం రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఉంటుందని తెలిపింది. ఇస్తాంబుల్‌లో 1971లో జన్మించిన ఇల్కర్ ఐచీ, 1994లో బిల్కెంట్ యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత 1995లో యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో రీసెర్చ్ చేసి, 1997లో ఇస్తాంబుల్‌లోని మర్మారా విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మాస్టర్స్ పూర్తి చేశారు. కాగా, ఇటీవలే అప్పుల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా సంస్థ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాటా సంస్థ ఎయిర్ ఇండియాలో సంస్కరణలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సంస్థకు ఛైర్మన్‌ను నియమించింది.