'శాశ్వత ముఖ్యమంత్రి జగనే.. సీఎం జగన్ అడుగుజాడల్లో నడుస్తాం'
ఏపీ బ్యూరో : నెల్లూరు జిల్లా వైసీపీలో సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త జిల్లాల ఏర్పాటు..latest telugu news
ఏపీ బ్యూరో : నెల్లూరు జిల్లా వైసీపీలో సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాకు కేటాయించడంతో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయంతో కలువాయ మండలంలో సంబరాలు అంబరాన్నంటాయి. తప్పెట్లు.. తారాజువ్వలు.. డిజే మేళ తాళాలతో.. జై జగన్.. జై జై ఆనం.. నినాదాలతో కలువాయి మార్మోగింది. సోమశిల.. తెలుగు గంగ ప్రాజెక్టులతో పాటు తమ ప్రాంతాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించేలా కృషి చేసిన ఆనం రామనారాయణరెడ్డికి, సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు ఆ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించిన సీఎం వైఎస్ జగన్‌ను శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగేలా కృషి చేస్తామని అన్నారు. మరోవైపు రాపూరులో 2 కోట్ల 30 లక్షలతో ఎంఆర్ఓ, ట్రెజరీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ ఆనం అరుణ శంకుస్థాపన చేశారు.
సీఎం జగన్‌కు అండగా ఉంటాం : మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి
సీఎం మంచి మనసుతో సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాకు కేటాయించారు. సైదాపురం, రాపూరులను నెల్లూరు రెవెన్యూ డివిజన్‌లో ఉంచారు. రాపూరుని సర్కిల్‌గా పోలీస్ శాఖ ఏర్పాటు చేయబోతోంది. డీజీపీ ఆ మేరకు హామీ కూడా ఇచ్చారు అని మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. సీఎం నిర్ణయంతో సోమశిల, కండలేరు జలాశయాలు కూడా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన సీఎం వైఎస్ జగన్‌కు అండగా ఉందాం. శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగేలా కృషి చేద్దాం అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. 'సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గంలో 20 వేల మంది పిల్లలకు టెట్రా మిల్క్ ,బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశాం. ఏసీ సుబ్బారెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం రాపూరు. ఆనం సంజీవరెడ్డి కూడా రాపూరు నుంచి గెలిచి మంత్రి అయ్యారు. మా కుటుంబం నుంచి మూడో వ్యక్తిగా నన్ను గెలిపించి మంత్రిని చేశారు. తెలుగుగంగ నీటి సమస్య పరిష్కారం కోసం 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశా. వైఎస్సార్ పాలనలో పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాం. ఆయన మరణాంతరం వచ్చిన పార్టీలు అభివృద్ధిని అటకెక్కించాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో రాపూరుకి అన్యాయం జరిగింది' అని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. జిల్లాల పునర్విభజన చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనతో ఇప్పుడు న్యాయం జరిగింది. సీఎం నిర్ణయంతో జలవనరులన్నీ నెల్లూరు జిల్లాలోనే ఉండబోతున్నాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నా అని మాజీమంత్రి ఆనం అన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు : ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్
సీఎం వైఎస్ జగన్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా జిల్లాల పునర్విభజన చేశారు. గూడురుని తిరుపతి జిల్లాలో కలపడాన్ని స్వాగతిస్తున్నాను. వైఎస్ జగన్ లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఎప్పటికీ సీఎంగా ఉండాలి. సంక్షేమం కొనసాగాలంటే ప్రజలు సీఎం వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలి'అని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ కోరారు.
జగన్ ఆలోచనలకు తగ్గట్లుగా పనిచేస్తాం : ఆనం అరుణ
సర్వేపల్లిని నెల్లూరులో కొనసాగేలా కృషిచేసిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి, రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలు నెల్లూరు ఉండేలా కృషి చేసిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిలకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణ అభినందనలు తెలిపారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి అభివృద్ధికి బాటలు వేస్తాం అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన దిశగా చేపట్టిన నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాలను నూతన తిరుపతి జిల్లాలో కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాపూరు మండల కేంద్రంలో జననేత, సీఎం వైఎస్ జగన్, దివంగత సీఎం వైఎస్ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్ కుటుంబం అమితంగా ప్రేమించే పసి పిల్లలందరికీ...టెట్రా పాలు.. బిస్కెట్స్ పంపిణీ చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.