సింగరేణి చరిత్రలో తొలిసారి.. కేంద్ర ప్రభుత్వమే సూత్రధారి..!!

సుదీర్ఘ చరిత్ర కలిగి, సిరుల వేణిగా భాసిల్లుతున్న సింగరేణిలోకి మరో ప్రైవేటు సంస్థ అడుగు పెట్టింది. కోయగూడెం–3 బ్లాకును ఆరో కోల్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నది.

Update: 2022-07-25 03:24 GMT

సుదీర్ఘ చరిత్ర కలిగి, సిరుల వేణిగా భాసిల్లుతున్న సింగరేణిలోకి మరో ప్రైవేటు సంస్థ అడుగు పెట్టింది. కోయగూడెం–3 బ్లాకును ఆరో కోల్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నది. ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అయింది. సింగరేణి పరిధిలోని కల్యాణఖని (బ్లాక్ నెం. 6), శ్రావణ్‌పల్లి, కోయగూడెం (బ్లాక్ నెం. 3), సత్తుపల్లి ( బ్లాక్ నెం. 6) అనే నాలుగు బ్లాకులకు టెండర్ల ప్రక్రియ మొదలైంది. కోయగూడెం బ్లాకు ఆరో కోల్ సంస్థకు దక్కగా.. మిగిలినవాటికి ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి కాలరీస్ సంస్థ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ బొగ్గు తవ్వకాలు చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం-3వ బ్లాకును టెండరు ద్వారా అరబిందో గ్రూపునకు చెందిన 'ఆరో కోల్ ప్రైవేటు లిమిటెడ్' అనే సంస్థ దక్కించుకున్నది. సింగిల్ టెండర్ దాఖలు చేయడంతో ఆ సంస్థకే లీజు ఖరారైంది. సుమారు 8.32 చదరపు కి.మీ. మేర విస్తరించి ఉన్న ఈ బ్లాకులో దాదాపు 119.60 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు అంచనా. ఇందులో 30 ఏళ్ల లీజుకు తీసుకున్న ఈ సంస్థ సుమారు 113.46 మిలియన్ టన్నులను సొంతం చేసుకోనున్నది. రిజర్వు బొగ్గు పరిమాణాన్ని పరిగణలోకి తీసుకుని ఈ కాంట్రాక్టు విలువ రూ. 20,750 కోట్లుగా ఖరారైంది. జీఎస్టీ, ఇతర ఛార్జీలు అదనం. శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న సింగరేణిలో బొగ్గు తవ్వకాలు ఆ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఈ వందేళ్ల చరిత్రలో తొలిసారి ఒక ప్రైవేటు సంస్థ ఇక్కడి బొగ్గును తవ్వుకునే అవకాశాన్ని చేజిక్కించుకున్నది. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించుకుని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించింది. ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా అవన్నీ బుట్టదాఖలయ్యాయి. చివరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అయింది. సింగరేణి పరిధిలోని కల్యాణఖని (బ్లాక్ నెం. 6), శ్రావణ్‌పల్లి, కోయగూడెం (బ్లాక్ నెం. 3), సత్తుపల్లి ( బ్లాక్ నెం. 6) అనే నాలుగు బ్లాకులకు టెండర్ల ప్రక్రియ మొదలైంది. కోయగూడెం బ్లాకు ఆరో కోల్ సంస్థకు దక్కగా.. మిగిలినవాటికి ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు.

ఆరో కోల్.. సింగిల్ టెండర్!

అరబిందో గ్రూపునకు చెందిన 'ఆరో కోల్ ప్రైవేటు లిమిటెడ్' అనే సంస్థ ఒక్కటే కోయగూడెం బ్లాకు కోసం టెండర్ దరఖాస్తు చేసుకున్నది. కేవలం ఒకే సంస్థ దరఖాస్తు చేసుకోవడంతో తొలి రెండు రౌండ్లలో ఆరో గ్రూపును టెండర్ కమిటీ ఖరారు చేయలేదు. నిబంధనల ప్రకారం మూడోసారి 'డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్' పద్ధతిన ఖరారు చేయక తప్పలేదు. టెండరు ఒప్పందం ప్రకారం 30 ఏళ్ళ వరకు ఆరో సంస్థకు లీజు అవకాశం ఉన్నది. ఈ లోపే బొగ్గు నిక్షేపాలు అయిపోతే ఒప్పందం అక్కడికే పరిమితం కానున్నది. దేశవ్యాప్తంగా పలు బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ రెగ్యులేషన్ చట్టం (1957) ప్రకారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని గెజిట్‌ జారీచేసింది.

వ్యతిరేకించిన సీఎం కేసీఆర్

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తున్న సింగరేణిలోకి ప్రైవేటు సంస్థలకు ఎంట్రీ ఇవ్వడం బాధాకరమని వ్యాఖ్యానించారు. గతేడాది డిసెంబరులో ప్రధాని మోడీకి లేఖ రాసి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బొగ్గు మంత్రిత్వశాఖతో మాట్లాడి నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం కాకుండా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు తవ్వకాల్లో సింగరేణి సంస్థకు అపారమైన అనుభవం ఉన్నందున ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తే ప్రభుత్వ రంగ సంస్థను నిర్వీర్యం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. దేశ బొగ్గు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పేబదులు సింగరేణి సంస్థకే వాటిని కేటాయించాలని సూచించారు. బొగ్గు బ్లాకుల్లో తవ్వకాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే 13వ ట్రెంచ్ ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అయినా కేంద్రం ప్రైవేటుపరం చేయడానికే మొగ్గుచూపింది. ఇదిలా ఉండగా.. ఆరో కోల్ సంస్థకు టెండర్ ఖరారైన విషయాన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ధృవీకరించింది. "మైన్ డెవలపర్ కమ్ ఆపరేటర్ అనుభవం ఉన్న సంస్థ ఒక్కటి మాత్రమే (సింగిల్ బిడ్డర్) టెండర్ దాఖలు చేసినట్లు సింగరేణి సంస్థ స్పష్టం చేసింది. టెక్నికల్, ఫైనాన్షియల్ అంశాల్లోనూ ఈ సంస్థకు తగిన అనుభవం ఉన్నట్లు పత్రాల ద్వారా స్పష్టమైంది. ప్రాజెక్టు అగ్రిమెంట్ ప్రకారం టెండర్ దక్కించుకున్న సంస్థ అవసరమైతే 51% వాటాను తనతో ఉంచుకుని మిగిలిన 49% వాటాను ఇతర సంస్థలకు భాగస్వామ్యం కల్పించి జాయింట్ వెంచర్ పద్ధతిలో పనిచేయడానికి అవకాశం కల్పించాం"అంటూ సింగరేణి సంస్థ ఇచ్చిన క్లారిటీని ఉదహరించారు. పార్లమెంటు వేదికగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కోయగూడెం-3 బ్లాకు మాత్రమే ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన కల్యాణ్‌ఖని, శ్రావణ్‌పల్లి, సత్తుపల్లి బ్లాకులకు కూడా ఇకపైన టెండర్లను ఆహ్వానించి ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియ కొనసాగనున్నది.

కేంద్రం మూర్ఖంగా వ్యవహరిస్తున్నది : కెంగర్ల మల్లయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం

"దేశంలోనే మొట్టిమొదటి ప్రభుత్వరంగ సంస్థ కళ్లముందే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతూ ఉన్నది. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థలో ప్రైవేటు శక్తులు చొరబడడం సమంజసం కాదని మేం వ్యతిరేకించాం. గతేడాది డిసెంబరులో మూడు రోజుల పాటు సమ్మె కూడా చేశాం. సింగరేణి సంస్థ యాజమాన్యం కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపి ప్రైవేటుపరం చేయొద్దని కోరింది. అయినా వినలేదు. మూర్ఖంగా తాను అనుకున్న నిర్ణయాన్నే అమలుచేస్తున్నది. సింగిల్ టెండర్ వచ్చినా కాంట్రాక్టు ఇవ్వక తప్పలేదు. కార్మికుల శ్రమతో లాభాల్లో ఉన్న సింగరేణిలో తొలిసారిగా ప్రైవేటు సంస్థను చూస్తున్నాం. బాధాకరం".


Similar News