ప్రభుత్వం, అధికారులు నాటకాలాడుతున్నారు.. ఒక్కరోజులో ధర ఎలా తగ్గుతుంది: రైతులు

దిశ, సూర్యాపేట : నూతన వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి, గేటు వేసిన సంఘటన శనివారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Update: 2022-04-09 10:30 GMT

దిశ, సూర్యాపేట : నూతన వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి, గేటు వేసిన సంఘటన శనివారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట నూతన వ్యవసాయ మార్కెట్‌కు రైతులు తమ పంటను తీసుకొచ్చారు. అయితే శుక్రవారం పంట 1850 రూపాయలు పలికింది. శనివారం రోజు అదే మద్దతు ధర పలుకుతుందని ఆశలతో మార్కెట్‌కు వచ్చిన రైతులకు చుక్కెదురైంది. దళారుల మోసంతో ఒక్క రోజులోనే ధాన్యం మద్దతు ధర రూ.1200లకు పడిపోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మార్కెట్‌లో సరైన గిట్టుబాటు ధర లభించక పోవడం బాధాకరం అన్నారు. మార్కెట్‌కు శనివారం 26,352 బస్తాల ధాన్యం రావడం జరిగిందని, అయితే వచ్చిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర అందించడంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్తిగా విఫలం అయ్యిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


తీసుకొచ్చిన ధాన్యానికి అతి తక్కువగా రూ.1200 నుంచి రూ.1500 ధర రావడం అన్యాయం అన్నారు. శుక్రవారం రోజు ధాన్యానికి రూ.1800 నుంచి రూ.1850 మద్దతు ధర ఇచ్చారని.. శనివారం రూ.ఐదు వందల వరకు తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. పంట మొదలు పెట్టిన దగ్గర నుంచి పంట దిగుబడి కావాల్సిన అన్ని విత్తనాలు, యూరియా, ఎరువులు, ఇలా పంటకు కావాల్సిన మందులకు వేల రూపాయలు ఖర్చు చేసి.. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత సరైన మద్దతు ధర ఇవ్వకుండా ప్రభుత్వం, అధికారులు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కమీషన్ దారులు, ఖరీదు దారులు, అధికారులు కుమ్మక్కై మా కష్టాన్ని, శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. మేము తెచ్చిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కాటా వేయనీయామని స్పష్టం చేశారు. అనంతరం మార్కెట్ కార్యదర్శి కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం గేటు వేసి నిర్బంధించారు.

Tags:    

Similar News