2026 నాటికి టెలికాం, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో అదనంగా 1.2 కోట్ల ఉద్యోగాలు!

న్యూఢిల్లీ: మరో మూడు నాలుగేళ్లలో దేశంలోని టెలికాం, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో..telugu latest news

Update: 2022-03-27 11:07 GMT

న్యూఢిల్లీ: మరో మూడు నాలుగేళ్లలో దేశంలోని టెలికాం, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో ఏకంగా 1.2 కోట్ల ఉద్యోగాలు కొత్తగా ఏర్పడనున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం కావడం, టెక్నాలజీ వినియోగం, డిజిటలైజేషన్ లాంటి కీలకమైన అంశాలు ఉపాధి పుంజుకోవడానికి వీలవుతుందని ప్రముఖ జాబ్ సైట్ టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక తెలిపింది. టెలికాం, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో సుమారు 750 సంస్థల నుంచి రూపొందించిన తాజా నివేదిక ప్రకారం.. ఈ మూడు రంగాలు రానున్న రోజుల్లో కొత్త విధానంలోకి మారనున్నాయని, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో వృద్ధి వల్ల కొత్త ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉందని టీమ్ లీజ్ డిజిటల్ హెడ్ సునీల్ చెప్పారు.

ఈ నేపథ్యంలో ఈ మూడు రంగాలకు సంబంధించి 2025-26 నాటికి ఉపాధి అవకాశాలు 25-27 శాతం పెరుగుతాయని, ప్రత్యేక నైపుణ్యం కలిగిన సుమారు 90 లక్షల మంది వరకు ఈ రంగాలకు అవసరమవుతారని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం టెలికాం, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్ రంగాల మార్కెట్ విలువ 1.5 ట్రిలియన్ డాలర్లుగా ఉందని నివేదిక తెలిపింది. అలాగే, ఇప్పుడు ఈ మూడు రంగాలు మొత్తం ఉపాధిలో 8.7 శాతానికి సమానమైన 4.2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, 2026 నాటికి అదనంగా మరో 1.2 కోట్ల ఉద్యోగాలు కొత్తగా వస్తాయని నివేదిక వెల్లడించింది.

Tags:    

Similar News