అద్దెల కోసం అద్దాల మేడలు..ఐటీ సెక్టార్‌లో ఇష్టారీతిగా నిర్మాణాలు
గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో ఒక చిన్నపాటి
దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో ఒక చిన్నపాటి రూమ్ కావాలంటే ఎంతలేదన్నా రూ.10 వేల నుంచి రూ.12 వేలు పెట్టాలి. ఓ సింగిల్ బెడ్ రూమ్ కోసం అయితే రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేయాల్సిందే. ఇక డబుల్ బెడ్రూంల మాట చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఫర్వాలేదులే అని అక్కడ రూమ్‌లు తీసుకుని ఆయా రాష్ట్రాలకు చెందిన వారు నివాసం ఉంటున్నారు. ఆ ఏరియాలో అంతలా డిమాండ్ ఉండడానికి కారణం ఏంటి..? అంటే పక్కనే ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డు. ఉద్యోగులకు అవసరమైన ఇతర సౌకర్యాలు సైతం అందుబాటులో ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో రూముల రెంట్లు ఆకాశాన్ని అంటుతాయి.
విస్తీర్ణం తక్కువ.. అంతస్థులు ఎక్కువ..
గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల చుట్టూ అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి. అలాగే ప్రముఖ షాపింగ్ మాల్స్ కొలువుదీరాయి. ఈ ప్రాంతాల్లో 50 గజాల స్థలం ఉంది అంటే చాలు అక్కడ తక్కువలో తక్కువ 3 అంతస్తులు, అత్యాశకు పోతే 5 నుంచి 6 అంతస్థుల పైన మరో రేకుల షెడ్ కట్టేస్తున్నారు. ఇలా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు నిర్మించి రెంట్లకు ఇస్తుంటారు. ఈ నిర్మాణదారులు కనీస నిబంధనలు పాటించడంలేదు. ఒకరి గోడకు ఆనుకునే మరొకరు నిర్మాణం సాగిస్తున్నారు. ఒక్కో గల్లీలో కనీసం కారు వెళ్లలేని దుస్థితి, బైకులు కూడా ఎక్కడపడితే అక్కడ రోడ్ల మీద పార్క్ చేసుకోవాల్సిందే. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే గల్లీలకు ఫైరింజన్ కూడా వెళ్లే అవకాశం లేదు. బిల్డింగ్ పక్కకు ఒరిగిన సిద్దిక్ నగర్‌లో ఒక్కో గల్లీలో పదుల సంఖ్యలో ఇల్లీగల్ నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ చాలా వరకు 50, 60 గజాల స్థలంలోనే 5, 6 అంతస్తులు, కొందరైతే 7 అంతస్తుల గాలిమేడలు కట్టేశారు.
ఆదాయం కోసం అదనపు ఫ్లోర్లు..
ఆదాయం కోసం యజమానులు చాలా వరకు ఓయో రూమ్స్ కోసం, కో లివింగ్, హాస్టళ్ల కోసం అద్దెలకు ఇస్తున్నారు. కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలో వందల సంఖ్యలో ఓయో రూమ్స్, కో లివింగ్, హాస్టల్స్ ఉన్నాయి. కొందరు యజమానులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అంతస్థుల మీద అంతస్తులు కట్టేసి కిరాయిలకు ఇచ్చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
పర్మిషన్ లు ఉండవు.. అయినా పట్టించుకోరు..
శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ రెండు సర్కిళ్ల పరిధిలో వందలాది నిర్మాణాలు సాగుతుండగా అందులో సుమారు 75 శాతం నిర్మాణాలకు కనీస అనుమతులు లేవనే చెప్పాలి. ఉన్న వారు కూడా అనుమతులకు మించి కట్టేస్తున్నారు. పైగా ఓ పెంట్ హౌజ్ వేసేస్తున్నారు. గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్, జేవీ కాలనీ, గోపన్‌పల్లి, నలగండ్ల ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక మాదాపూర్ ప్రాంతంలో అయ్యప్ప సొసైటీ, ఖానామెట్ ఏరియాలో అసలు అనుమతులు లేకున్నా ఒక్కో బిల్డర్ 8 అంతస్తుల వరకు కట్టేస్తున్నారు.
కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్ నగర్, మియాపూర్ డివిజన్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు అందినకాడికి దండుకుని చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జీహెచ్ఎంసీ సిబ్బంది తీరుపై సర్వత్రా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది మంచిదే.. కానీ ఇలాంటి అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోతే సిద్దిక్ నగర్‌లో జరిగిన సంఘటనలు మరిన్ని జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు మామూళ్ల మత్తులో నుంచి బయటకు వచ్చి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.